రాజా ది గ్రేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ సినిమాల్లోకి రవి తేజ కుమారుడు రవితేజ చిన్నతనంలోని పాత్రలో మహాధన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా వారసత్వపు హీరోల హవా నడుస్తుంది. కేవలం హీరోల వారసులే కాకుండా దర్శక, నిర్మాతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ..పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇండియట్’ చిత్రంతో హీరోగా మారారు. అంతకు ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తున్న రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో మెప్పించడంతో ఇడియట్ లో చంటి గాడు లోకల్ అంటూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అందుకే.. ఇండస్ట్రీలో ఇప్పుడు మాస్ మహరాజుగా అభిమానులు పిల్చుకుంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా రవితేజ ఎంతో కష్టపడి పైకి వచ్చారని అంటారు...అంతే కాదు ఆయన తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మద్య రవితేజ చిన్న తమ్ముడు భరత్ కారు ప్రమాదంలో మృతి చెందారు. ప్రస్తుతం రవితేజ 'రాజా ది గ్రేట్', 'టచ్ చేసి చూడు' చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ‘రాజా ది గ్రేట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి ముస్తాబవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కాకపోతే ఈ సినిమాలో రవితేజ చిన్నతనంలోని పాత్ర మహాధన్ నటిస్తున్నాడట.
సాధారణంగా రవితేజ ఏ ఫంక్షన్లకు తన కుటుంబాన్ని తీసుకు రారు..చానల్స్ లో కూడా ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యులను పరిచయం చేయలేదు. అప్పుడెప్పుడో తన ఇద్దరు పిల్లలతో ఉన్న ఫోటో రిలీజ్ చేశారు. అలాంటిది రవితేజ ఒక్కసారిగా తన తనయుడిని వెండితెర ద్వారా పరిచయం చేస్తుండటం విశేషం. భవిష్యత్తులో ఈ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
