సిట్ విచారణకు హాజరైన రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు నాలుగు గంటలపాటు విచారించిన సిట్ సోమవారం తనీష్, మంగళ వారం నందుల విచారణ

టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా సెలబ్రెటీలను సిట్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరాలో కెల్విన్ ముఠా పట్టుబడడంతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా టాలీవుడ్ కు డ్రగ్స్ లింక్ ఉందని సిట్ భావిస్తూ పలువురు సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తరుణ్, శ్యామ్ కె.నాయుడు, నవదీప్, రవితేజ, చార్మి,, ముమైత్ లను విచారించిన సంగతి తెలిసిందే.

శనివారం రవితేజ దగ్గర పనిచేసే డ్రైవర్ శ్రీనివాస రావును సిట్ విచారించింది. ఉదయం నుండి కొనసాగిన ఈ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. విచారణలో డ్రగ్స్ కు సంబంధించిన విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ను శ్రీనివాస రావు తీసుకొచ్చి రవితేజకు ఇచ్చాడని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ అంశాలే కాకుండా ఇతర వాటిపై సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోమవారం తనీష్..మంగళవారం నందులను సిట్ బృందం విచారణ జరుపనుంది.