Asianet News TeluguAsianet News Telugu

అమ్మ చాలా కుంగిపోయింది.. నేనూ చాలా బాధపడ్డా: రవితేజ

  • తాజాగా రాజా ది గ్రేట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రవితేజ
  • ఈ మూవీలో ఓ అంధుడి పాత్రలో నటిస్తున్న రవితేజ
  • ఈ మూవీ ప్రమోషన్ సందర్భంంగా ఇటీవల ఘటనలు బాధించాయన్న రవితేజ
ravi teja burst out his emotions at raja the great promotion interaction

టాలీవుడ్‌లో మాస్ మహారాజ రవితేజ తాజాగా నటించిన చిత్రం రాజా ది గ్రేట్ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా రవితేజ ఇటీవల ఆయన జీవితంలో చోటుచేసుకొన్న డగ్ర్స్ కేసు, సోదరుడి మరణం, వ్యక్తిగత, ప్రొఫెషనల్ వ్యవహారాలకు సంబంధించిన పలు విషయాలను మీడియా ప్రతినిథులతో పంచుకొన్నారు.

 

ప్రేక్షకులను, అభిమానులను మెప్పించే చిత్రాలు చేయాలన్న ఉద్దేశంతోనే మంచి కథలపై దృష్టిపెట్టాం. కొన్ని కథలు అనుకొన్నా ఎందుకు సెట్స్ మీదకు వెళ్లలేకపోయాయి. అందుకే ఏడాది కాలంగా గ్యాప్ వచ్చింది. రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్రను పోషిస్తున్నాను. దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకొన్నది. అతనిపై ఉన్న నమ్మకంతోనే నేను ఈ చిత్రం చేస్తున్నాను. పటాస్ కథ ముందు నాకే చెప్పాడు. కొన్ని కారణాల వల్ల చేయలేక పోయాను. ఆ తర్వాత దిల్ రాజు సూచన మేరకు మళ్లీ నాకు ఈ చిత్ర కథ చెప్పాడు. కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. అందుకే అంధుడి పాత్రను సవాల్‌గా తీసుకొని చేస్తున్నాను.

 

రాజా ది గ్రేట్ చిత్రంలో అంధుడి పాత్ర కోసం రీసెర్చ్ కూడా చేశాను. చాలా విషయాలపై దృష్టిపెట్టాను. చిన్న జియ్యర్ స్వామి స్కూల్‌లో చిన్నారులను చూశాక ఈ పాత్రకు స్ఫూర్తి కలిగింది. వేదిక మీద ప్రదర్శన ఇచ్చేటప్పుడు వాళ్లు చూపిన ప్రతిభ ఆకట్టుకొంది. అంధులు నిస్తేజంగా ఉంటారను కోవడం తప్పు. వాళ్లలో మనకంటే ఎక్కువ ఆత్మ విశ్వాసం ఉంటుంది అని తెలుసుకొన్నాను. సినిమాలో వైవిధ్యం ఉన్నప్పుడే ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీల్ అవుతారు. ప్రేక్షకులకు మూస చిత్రాలు చూసి విసుగు వచ్చింది. కొత్తదనం లేకుంటే ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. బాగా ఉంటేనే వస్తున్నారు అని అభిప్రాయ పడ్డారు రవితేజ.

 

ఇక రాజా ది గ్రేట్‌కు మరో ప్రత్యేకత కూడా ఉందన్నారు. ఈ చిత్రంలో నా కుమారుడితో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా సినిమా నా కుమారుడు పరిచయం అవుతున్నాడు. దర్శకుడు అనిల్ సూచన మేరకు మా అబ్బాయి చేత ఓ మంచి పాత్ర చేయించాం. ఈ చిత్రంలో నా కుమారుడు చిన్నప్పటి రవితేజగా నటించాడు. అందరూ బాగుందని అంటున్నాను. ఇంకా నేను మా అబ్బాయి నటించిన సీన్లను చూడలేదు అని రవితేజ తెలిపారు.

 

ఇక ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో చాలా ఇబ్బంది పడ్డానన్నారు రవితేజ. తనపై ఆరోపణలు ఎందుకు వచ్చాయో తెలియడం లేదన్నారు. అయితే జీవితంలో ఓ భాగం అనుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నానన్నారు. మీడియాలో ఎవరికీ తోచినట్టుగా వారు కథనాలు రాయడం మరీ ఇబ్బంది పెట్టిందని రవితేజ వాపోయారు. డ్రగ్స్ కేసు, తమ్ముడు భరత్ మరణం తమ కుటుంబాన్ని చాలా బాధ పెట్టాయన్నారు.

 

ముఖ్యంగా మా అమ్మ చాలా కుంగిపోయింది. ఇప్పుడిప్పుడే చేదు సంఘటనల నుంచి బయట పడుతున్నారు. నేను చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినప్పుడు కూడా అంతగా బాధపడలేదు. డ్రగ్స్‌ కేసు విషయంలో కావాలని కొన్ని ఛానెళ్లు ప్రత్యేక కథనాలు రాశాయి. దానికి మాత్రం చాలా బాధపడ్డా. త్వరలోనే ఆ విషయంపై నేనే మీడియా ముందుకొచ్చి మాట్లాడుదామని అనుకుంటున్నానని రవితేజ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios