Asianet News TeluguAsianet News Telugu

రంగుల రాట్నం మూవీ రివ్యూ రేటింగ్

  • చిత్రం : రంగుల రాట్నం
  • నటీనటులు: రాజ్ తరుణ్, చిత్ర శుక్లా, సితార, ప్రియదర్శి తదితరులు
  • మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల 
  • కథ, దర్శకత్వం: శ్రీరంజని
  • నిర్మాత: అక్కినేని నాగార్జున
  • ఆసియానెట్ రేటింగ్ : 2/5
rangula ratnam movie review rating

సరదాగా నడిచే కథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రాజ్ తరుణ్. వరుసగా విజయాలు సాధిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఈసారి సంక్రాంతి బరిలోకి పవన్,బాలయ్య, సూర్య లాంటి హీరోలతో పోటీపడుతూ బరిలో దిగాడు రాజ్ తరుణ్. తనకు హీరోగా తొలి అవకాశమిచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ‘రంగుల రాట్నం’ అనే ప్రేమకథా చిత్రాన్ని చేశాడు. సంక్రాంతి సందర్భంగా ఎంతో నమ్మకంగా బరిలోకి దింపిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం! 

కథ: 

విష్ణు(రాజ్ తరుణ్) సాఫ్ట్‌ వేర్ రంగంలో స్ధిరపడిన యువకుడు. తన తల్లి(సితార)తో కలిసి జీవిస్తుంటాడు. విష్ణుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటుంది సితార. అదే సమయంలో ఒక పెళ్లిలో కీర్తి(చిత్రా శుక్లా) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు విష్ణు. తన కొడుకు ప్రేమను సపోర్ట్ చేస్తుంది సితార. కానీ అనుకోకుండా సితార చనిపోతుంది. తల్లిని పోగొట్టుకున్న విష్ణు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ప్రేమించిన అమ్మాయితో పెళ్లికాకుండానే తల్లి చనిపోవడంతో బాధలో కూరుకుపోయిన విష్ణు ఎలా బయటపడ్డాడు..? కీర్తి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు..? అనేదే మిగతా కథ

విశ్లేషణ:

 కామెడీతో మొదలుపెట్టి ఇంటర్వెల్‌కి వచ్చేసరికి పూర్తి భావోద్వేగభరితంగా మార్చేశారు. ప్రథమార్ధం రొటీన్ స్క్రీన్‌ప్లే‌తో సాగిపోతుంది. అమ్మ సెంటిమెంట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేసిన డైరెక్టర్.. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో కనెక్టివిటీ సరగా మ్యాచ్ చేయలేదనిపిస్తుంది.. హీరో అమ్మగా సితార అంతగా కుదరలేదనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది.. సితార నటన, డబ్బింగ్ అసలు కుదరలేదు. రాజ్ తరుణ్‌కి, సితారకు మధ్య సెంటిమెంట్ పండలేదు. ద్వితీయార్ధం మరింత భారంగా గడుస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ‘కేరింగ్’ అంటూ విధించే షరతులు హీరోని బాగా ఇబ్బంది పెడతాయి. తెరపై ఆ ఇబ్బందులను చూసే ప్రేక్షకుడు మరింత ఇబ్బంది పడతాడు. సినిమాలో హైలైట్ అని చెప్పుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం బాధాకరం.

 

క్లైమాక్స్‌ లో కమెడియన్ ప్రియదర్శన్ పాత్ర లేకుండా సన్నివేశాలను ఊహించుకోలేం. అంతగా తన నటనతో ఆకట్టుకున్నాడు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరువాత పూర్తిస్థాయిలో ప్రియదర్శన్ కనిపించిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. హీరోతో పాటు ఉండే ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ప్రియదర్శన్ తనదైన నటనతో, కామెడీతో మెప్పించాడు. రాజ్ తరుణ్ మరోసారి సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నాడు. భావోద్వేగ సన్నివేశాల్లో జీవించేశాడు. చిత్ర శుక్ల పద్ధతిగా, చాలా చక్కగా కనిపించింది. నటన పరంగా పర్వాలేదనిపించింది. ఒక ప్రేమకథను నిజాయితీగా తెరపై చూపించాలనుకున్న దర్శకురాలు స్క్రీన్‌ప్లే‌ను బలంగా రాసుకోలేకపోయారు. సినిమా మొత్తం చాలా నిదానంగా సాగుతుంది. సినిమాకు సంగీతం మరో పెద్ద బలహీనతగా మారింది. ఏ ఒక్క పాట వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతం కొన్నిచోట్ల సన్నివేశాలని డామినేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

అయితే లవ్, సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా లేకపోవటంతో అంతా మిస్సింగ్ అనిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios