రంగస్థలం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తోంది. సినిమా థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయ్యింది కానీ ప్రేక్షకుల తాకిడి ఇంకా తగ్గలేదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా మెగా పవర్ స్టార్ ఇమేజ్ ను విపరీతంగా పెంచేసింది. మొదటి వారంలో రికార్డు కలెక్షన్లు సాధించిన రంగస్థలం రెండో వారంలోనూ అదే దూకుడును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. మూడోవారం లోకి ఎంటరైన రంగస్థలం బుధవారానికి వందకోట్ల షేర్ దాటేసింది. దీంతో ఇప్పటికే రంగస్థలం షేర్ 103 కోట్లకు చేరింది. ఇప్పుడు చిట్టిబాబు... చిరూ సినిమా రికార్డుపై కన్నేశాడు. చిరూ కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెం. 150’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపి... నాన్- బాహుబలి ఇండస్ట్రీ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. తన 150 వ సినిమాతో దాదాపు 105 కోట్ల షేర్ సాధించాడు మెగాస్టార్. ఇప్పుడు చిట్టిబాబు నెక్ట్స్ టార్గెట్ అదే.

ఇప్పటికే ‘శ్రీమంతుడు’- ‘జనతా గ్యారేజ్’ - ‘అత్తారింటికి దారేది’- ‘జైలవకుశ’ ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్టులను దాటేసాడు చిట్టిబాబు. ఈ వారం విడుదలైన నాని సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండడంతో మరికొన్ని రోజుల్లో ఖైదీ సినిమాను కూడా దాటేయడం ఖాయమే. చెర్రీ ఫుల్ రన్ లో ఎంత షేర్ సాధిస్తాడనేది ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అయితే ఈ రికార్డులు ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. వచ్చే వారం రాబోయే ‘భరత్ అనే నేను’ సినిమాపై భారీ అంచనాలుండడంతో పాజిటివ్ టాక్ వస్తే... రంగస్థలం కలెక్షన్లను దాటడం ఖాయమే అంటున్నారు సూపర్ స్టార్ అభిమానులు.