రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. శనివారం ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మాస్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత లుక్‌ కూడా విడుదలైంది. నీళ్లు తోడే ఆయిల్ ఇంజిన్‌లో సమంత డీజిల్‌ పోస్తుండగా, రామ్‌చరణ్‌ దేవుడికి దణ్ణం పెట్టుకుంటున్న లుక్‌ ఫన్నీగా ఉంది. ఇందులో సమంత పేరు మహాలక్ష్మి అని తెలుస్తోంది.

 

రామ్‌చరణ్‌ మొక్కజొన్న పొత్తులను నెత్తిన పెట్టుకుని వస్తున్న మరో ఫొటో కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన చెర్రీ మాస్‌లుక్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గళ్ల లుంగీ, బనియన్‌తో కండువాను మెడలో వేసుకుని చిందేస్తున్న ఫొటో అదిరిపోయింది.

 

జగపతిబాబు, అనసూయ భరద్వాజ్‌, ఆది పినిశెట్టి, రంభ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో ఆడి పాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. వేసవి కానుకగా మార్చి 30న ‘రంగస్థలం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం వెల్లడించింది.