లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై చంద్రబాబు స్పందన ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తే ఎవరూ నమ్మరన్న బాబు వక్రీకరిస్తే ఎవరూ చూడరు కాబట్టే నిజాలను చూపిస్తానన్న వర్మ ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని చిరిగిన పేజీలను తిరిగి అతికిస్తానన్న వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలపెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఇప్పుడు తెలుగు నోళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సంబంధించి వర్మపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు వర్మ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్, ఎమ్మెల్యే అనిత లాంటి నేతలకు ధీటుగా సమాధానం చెప్పిన వర్మ.. తాజాగా వాణి విశ్వనాథ్, ఎమ్మెల్యే ప్రభాకర్ లకు కూడా తనదైన శైలిలో జవాబులిచ్చాడు.
ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను మాత్రమే ఈ సినిమాలో చూపించనున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ నేత రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా వైసీపీ నేత రంగంలోకి దిగటంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంబంధించి అటు టీడీపీ నేతలకు, ఇటు వర్మకు మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించేలా సినిమా తీస్తే సహించేది లేదని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పైగా లక్ష్మిపార్వతి ఎపిసోడ్ ను మాత్రమే తెరకెక్కిస్తాననడంతో వర్మపై ఆ కోపం మరింత పెరిగిపోయింది.
ఇక వర్మ సినిమాకు సంబంధించిన వివరాలు సీఎం చంద్రబాబు వరకూ తీసుకెళ్లారు టీడీపీ నేతలు. ప్రత్యేకంగా ఈ సినిమాపై చర్చించారు. అయితే చంద్రబాబు మాత్రం.. అదంతా లైట్ తీసుకోవాలని, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమని, దాన్ని వక్రీకరించి తీస్తే ప్రజలు నమ్మరని అన్నారు.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించారు. చంద్రబాబు చెప్పిన మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. తాను ఒకవేళ వక్రీకరించి తీస్తే ఎవరూ సినిమా చూడరని, తాను అలా తీయబోనని చెప్పారు. ఉన్నది ఉన్నట్టే తీస్తానన్నారు. చంద్రబాబు చెప్పినట్టు ఎన్టీఆర్ జీవితం నిజంగా తెరిచిన పుస్తకమేనని వర్మ అన్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్మ పలువురు వైసీపీ లీడర్లతో సమావేశమవుతున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో ఉండడం, వైసీపీ నేత నిర్మాత కావడం, జగన్ బావ బ్రదర్ అనిల్ తో ప్రత్యేకంగా సమావేశం కావడం.. లాంటి పరిణామాలు టీడీపీ నేతల్లో చర్చకు తెరతీస్తున్నాయి. ఎన్నికల వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమైనా ప్రభావం చూపిస్తుందేమోనన్న భయం తెదెపా నేతల్లో కనిపిస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం లైట్ తీసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్మ సినిమాపై ఎక్కువగా స్పందించొద్దని సూచించారు.
