లెజెండరీ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా పట్టాలెక్కుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు వర్మ ప్రకటించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో రాంగోపాల్ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వచ్చే అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదనీ..అందులో ఒక అధ్యాయాన్ని మాత్రమే తెరకెక్కిస్తున్నానని ఆర్జీవీ తెలిపారు. ఎన్టీఆర్ లైఫ్‌లోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తరవాత రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు, ఆయన ఎదుర్కొన్న అవంతరాలు, మానసిక క్షోభ తదితర అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. ఒక పార్టీనో, వ్యక్తినో కించపరచడానికి తీస్తున్న సినిమా కాదని, మహావ్యక్తి గురించి చెప్పే చిత్రమని అన్నారు. కేవలం లక్ష్మీ పార్వతి వచ్చిన దగ్గరి నుంచి ఎన్టీఆర్ కాలం చేసినంత వరకు ఉన్న అంశాలతోనే ఈ సినిమా ఉంటుందని స్పష్టం చేశారు.‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నచ్చి.. ఎన్టీఆర్ బయోపిక్ తనతో తీయమని బాలకృష్ణ అడిగితే తీస్తారా’ అని ఓ విలేకరి అడగగా.. తీయనని వర్మ సమాధానం ఇచ్చారు. తాను మొత్తం ఎన్టీఆర్ జీవితాన్ని చదివానని, తనకు కేవలం లక్ష్మీ పార్వతి ఘట్టం మాత్రమే నచ్చిందన్నారు. కాబట్టి ఇది తప్ప.. ఎన్టీఆర్‌పై మరే చిత్రం తీయనని స్పష్టం చేశారు. ‘ఇప్పటి వరకు మీకు పరిచయంలేని వైసీపీకి చెందిన ఓ నాయకుడిని నిర్మాతగా పెట్టి ఈ సినిమా తీయడం వెనుక దురుద్దేశమేమైనా ఉందా’ అని మరో విలేకరి ప్రశ్నించగా.. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నీ కొత్త నిర్మాతలతోనేనని, ఇది కూడా అంతే అని వర్మ సమాధానం ఇచ్చారు. దీనిలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు.