సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక వివాదంతో రచ్చ  చేస్తునే వుంటారు. ఇటు సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే వర్మ తాజాగా ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా నటిస్తుందని వర్మ ప్రకటించారు.

 

వర్మ ఆఫర్‌పై ఆర్కే రోజా సానుకూలంగా స్పందించారు. తన దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన నేపథ్యంలో రోజా కూడా పాజిటివ్ గా స్పందించింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మంచి రోల్ ఇస్తే తప్పక నటిస్తానన్నారు. వర్మ ఏ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో తనకు తెలియదని ఆమె చెప్పారు. వర్మతో చర్చించాక అన్ని వివరాలూ వెల్లడిస్తానన్నారు.

 

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోజా ఇటీవలి కాలంలో సినిమాల్లో నటించడం లేదు. రాజకీయాలతోపాటు టీవీ షో లతో ఆమె బాగా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆఫర్‌పై ఆమె సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఇక ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాలను సినిమాగా తీస్తానని వర్మ ప్రకటించారు. సినిమాకు వైసీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

చిత్తూరు జిల్లాలోని పలమనేరులో లక్ష్మీస్‌ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటికి దర్శకుడు రాంగోపాల్‌వర్మ వెళ్లారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే దాకా జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం తెరకెక్కిస్తామన్నారు. చిత్రంలో పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరనీ నిర్ణయించలేదని తెలిపారు.

 

అయితే ఈ చిత్రంలో ఎమ్మెల్యే రోజాకు మాత్రం తప్పనిసరి అవకాశం ఉంటుందని వర్మ అన్నారు. ఎన్టీ రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయడం తనకెంతో సంతోషమన్నారు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు ఎంత ఖర్చయినా భరిస్తానని నిర్మాత రాకేష్ రెడ్డి అన్నారు.