సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” వీడియోతో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద దర్శకుడు జీఎస్టీపై విచారణ నిమిత్తం హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల ముందుకు హాజరయ్యారు. పోర్న్‌స్టార్ మియా మాల్కోవాను పూర్తి నగ్నంగా చూపిస్తూ సినిమా తీయడం పట్ల వర్మపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ సినిమా చర్చ సమయంలో తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వర్మపై సామాజిక కార్యకర్త దేవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ ఎట్టకేలకు శనివారం నాడు విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు. కార్యాలయం లోపలికి వీరిద్దరిని తప్ప, మరెవరినీ అనుమతించకపోవడంతో వర్మను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

 

సాయంత్రం 4 గంటల వరకూ ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. అసలు వర్మ ఈ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీని తెరకెక్కించడానికి గల కారణాలు.. చర్చావేదికపై మాట్లాడిన అంశాలను, అందుకు గల వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం వాటికి అనుగుణంగా ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తామని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు.