ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారానికి దారితీసింది.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్

టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదం అంటే వర్మ, వర్మ అంటే వివాదం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కాని ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యాడు ఈ దర్శకుడు. ఇక టాలీవుడ్ లో తన సినిమా ప్రస్థానం మొదలు పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బాలీవుడ్‌ కు వెళ్లి, అక్కడ కూడా దశాబ్దానికి పైగా తనదైన మార్క్ చూపించారు. రంగీలా, సత్య, సర్కార్, రక్తచరిత్ర లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలతో రెచ్చిపోయాడు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వర్మ, ఎన్నో వివాదాస్పద సినిమాలు కూడా చేసి విమర్శలకు గురయ్యాడు. తాజాగా వర్మ మరో వివాదానికి తెరలేపాడు, ఈ శుక్రవారం వర్మ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

రామ్ గోపాల్ వర్మ టీచర్స్ డే వివాదం

వర్మ మనసులో ఏది దాచుకోడు. తనకు అనిపించిన విషయాలు బయటకు వెల్లడించడం అతనికి అలవాటు. ఇలా ఎన్నో విషయాలు బయటకు చెప్పకూడనివి కూడా పబ్లిక్ గా మాట్లాడి, విమర్శలపాలు అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి వివాదాస్పదం అయ్యాడు ఆర్జీవి. వివరాల్లోకి వెళితే, టీచర్స్ డే రోజున రామ్ గోపాల్ వర్మ తనకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల జాబితాను షేర్ చేస్తూ, వారికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. అయితే ఆ జాబితాలో అతను పేర్కొన్న పేర్లలో ఒకటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

వర్మ పోస్ట్:

“నేను దర్శకుడిగా మారడానికి, నా జీవితంలో నాకు నచ్చింది చేయడానికి నన్ను ప్రేరేపించిన గొప్ప వ్యక్తులందరికీ ఇదే నా సెల్యూట్. నాకు స్ఫూర్తిగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకు టీచర్స్ డే శుభాకాంక్షలు.” అని తన పోస్ట్ లో వెల్లడించారు. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వర్మ ట్వీట్‌ వైరల్ అయింది. వెంటనే నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక అంతర్జాతీయ ఉగ్రవాదిని , భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని , గురువుగా చెప్పడమేంటని ప్రశ్నించారు. పైగా, పవిత్రంగా భావించే ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇలా చేసిన వర్మ తీరు చాలా అభ్యంతరకరమని కామెంట్లు వస్తున్నాయి.

Scroll to load tweet…

వర్మ ట్వీట్ పై తీవ్ర వ్యతిరేకత

“ఇలాంటి ట్వీట్లు దారుణం. దావూద్‌ను గర్వంగా ప్రస్తావించడం సిగ్గుచేటు”

“ఇది ఉపాధ్యాయుల దినోత్సవం... నేరస్థుడిని మెంటార్‌గా చెప్పడమేంటో?”

“మీ అభిప్రాయం మీది, కానీ ఓ రోజు ప్రత్యేకతను ఈ స్థాయిలో దిగజార్చడం తగదు.” అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

అసలు దావూద్ ఇబ్రహీం భారతదేశం కోసం వెతుకుతున్న ప్రధాన నేరస్థుడిగా, ముంబై బాంబు పేలుళ్ల (1993) కేసులో ప్రధాన కుట్రదారుడిగా నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ సినీ దర్శకుడు ఆయనను "స్ఫూర్తిదాత"గా పేర్కొనడం పెద్ద వివాదానికి దారితీసింది. వర్మ తరచూ తన విభిన్న అభిప్రాయాలతో, బోల్డ్ వ్యాఖ్యలతో వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ఈసారి చేసిన వ్యాఖ్యలు సామాజికంగా తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. అయితే ఈ అంశం ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి. నెటిజన్ల ట్రోలింగ్, విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, వర్మ తరహాలో అతని స్టైల్‌లో స్పందిస్తాడా లేదా అన్నది గమనించాల్సిన విషయం.