గతంలో ట్విట్టర్ వేదికగా మెగా ఫ్యామిలీ పై విరుచుకుపడ్డ రామ్ గోపాల్ వర్మ వర్మకు ఏమైందో ఏమో.. సడెన్ గా రూటు మార్చాడు నాగబాబుకు సారీ అని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదం. శివ నుంచి వంగవీటి దాకా హిట్టుతో సంబంధం లేకుండా వర్మ ప్రతి సినిమా ఓ సెన్సేషనే. సినిమాలేకాదు వర్మ ట్వీట్లతో చంపేస్తూ ఉంటాడు కూడా. సోషల్ మీడియాలో తనదైన పోస్ట్ లతో ఎప్పటికప్పుడు వివాదాలకు అగ్గి రాజేసే వర్మ సడెన్ గా రూటు మార్చాడు. అదేంటో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు మారిపోయాడు. ఇన్నాళ్లూ ట్వీట్స్‌తో హీరోలకు తలనొప్పిగా మారి... వారిని తీవ్ర అసహనానికి గురిచేసిన వర్మ తన పంథాను మార్చుకున్నాడు. ఇటీవల వర్మ తన తల్లిపై, బిగ్ బీ అమితాబ్‌పై, హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‌పై ఒట్టేసి తన వైఖరిని మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు.
అంతేకాదు, పవన్ ఫ్యాన్స్‌కు, గణపతి భక్తులకు క్షమాపణలు చెబుతున్నట్లు కూడా ట్వీట్ చేశాడు. అయితే తాజాగా రాంగోపాల్ వర్మ చేసిన ఒక ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. మెగా బ్రదర్ నాగబాబుపై తాను చేసిన కామెంట్స్‌కు వర్మ క్షమాపణలు కోరాడు. దీంతో విస్తుపోవడం సినీ జనం వంతైంది. నిజంగా ఈ ట్వీట్ చేసింది వర్మేనా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, వర్మ తన ట్వీట్‌లో ‘చిరంజీవి గారి లాంటి అన్నయ్య నాకుంటే, నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు గారు మాటలతో వదిలేశారు.రియల్ సారీ హిమ్’ అని ట్వీట్ చేశాడు.
వర్మ చేసిన ఈ ట్వీట్స్‌తో మెగా అభిమానులు శాంతించారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నందుకు సంతోషం అంటున్నారు. కొందరైతే ఇది నిజమా కాదా అని గిల్లి చూసుకుంటున్నారు. వర్మలో వచ్చిన ఈ మార్పు శాశ్వతంగా ఉంటుందో, లేక అంతా తూచ్ ఆ ట్వీట్స్ చేసింది తాను కాదని మళ్లీ ట్వీట్ చేస్తాడోనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఇలా రివర్స్ గేర్ వేసిన సందర్భాలూ లేకపోలేదు. ఖైదీ నెం.150 ఫంక్షన్‌లో మెగాబ్రదర్ నాగబాబు వర్మపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. వర్మను అక్కుపక్షి అంటూ నాగబాబు సంబోధించాడు. ఈ కామెంట్స్‌పై వర్మ ట్వీట్స్ రూపంలో నాగబాబుపై యుద్ధం ప్రకటించాడు. చిరంజీవి లేకపోతే నాగబాబుకు గుర్తింపే లేదని వర్మ ట్వీట్ చేశాడు. మీకు ఇంగ్లీష్ అర్థం కాకపోతే ఓ ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్‌తో నా ట్వీట్స్ అర్థం ఏంటో చెప్పించుకోండి అంటూ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ చేసిన ఈ ట్వీట్స్ పెను దుమారాన్నే రేపాయి.
