మార్చి ౩౦న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రంగస్థలం' సినిమా నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టింది. భారీ విజయం దక్కించుకొని ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమా మరీ ఇంతటి విజయం సాధిస్తుందని ఊహించని చిత్ర నిర్మాతలు డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కు విక్రయించారు. వారి ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నలభై ఐదు రోజుల తరువాత ఆన్ లైన్ లో సినిమాను పెట్టేసుకోవచ్చు.

ఆదివారం నాటికి ఈ సినిమా విడుదలై 44 రోజులయినప్పటికీ సినిమా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ రేంజ్ లో ఆడుతున్న సినిమాను ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం ఏంటని అభిమానులు నిర్మాతలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీసం పది వారాల వ్యవధైనా లేకుండా థియేటర్ లో ఉన్న సినిమాను ఆన్ లైన్ లో పెట్టడం కరెక్ట్ కాదంటూ అభిమానులు వాదిస్తున్నారు.

నిర్మాతలు కూడా అమెజాన్ వారిని కొంతకాలం ఆగి ఆన్ లైన్ లో పెట్టాలని రిక్వెస్ట్ చేసినా వారు మాత్రం ఒప్పందం ప్రకారమే నడుచుకుంటామని మార్పు చేయలేమని చెప్పేశారట. ఇక చేసేదేమీ లేక నిర్మాతలు గమ్మునుండిపోయారు. ఇకనైనా కంటెంట్ ఉన్న సినిమాల డిజిటల్ రైట్స్ సినిమా విడుదలైన తరువాత విక్రయిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు.