బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై డీవోపీ రత్నవేలు అంచనాలు పెంచేశారు. రత్నవేలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.
రామ్ చరణ్ పెద్ది మూవీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, చిత్ర బృందం ఇటీవల కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసింది.
నిప్పులు చెరిగిన చరణ్
ఈ సందర్భంగా చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఆర్. రత్నవేలు మీడియాతో మాట్లాడుతూ, రామ్ చరణ్‌పై రూపొందించిన ఓ నైట్ యాక్షన్ సీన్‌ను పూర్తి చేసినట్టు తెలిపారు. ఇది చాలా ఇంటెన్స్, గ్రిట్టీ విజువల్స్తో కూడుకున్న సీన్ అని పేర్కొన్నారు. "ఈ సీన్‌లో రామ్ చరణ్ నిప్పులు చెరుగుతున్నట్లు చెలరేగిపోయాడని" రత్నవేలు ప్రశంసలు కురిపించారు.
ఇందుకు ముందు, జూన్ 19న చిత్రబృందం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్లో ట్రైన్‌స్టంట్ సీన్‌ను షూట్ చేశారు. ఈ హై ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను భారతీయ సినిమాల్లో తొలిసారిగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సీన్ కోసం రామ్ చరణ్ చాలా రిస్కీ స్టంట్స్ కూడా స్వయంగా చేశారు. ఈ సన్నివేశం పూర్తయ్యాక నైట్ ఎఫెక్ట్ తో మరో యాక్షన్ బ్లాక్ షూటింగ్ జరిగింది. ఇలా వరుస యాక్షన్ సన్నివేశాల గురించి వస్తున్న వార్తలు రామ్ చరణ్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా రత్నవేలు కామెంట్స్ తో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి.
రత్నవేలు, గతంలో ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంలో ఆయన చూపిస్తున్న ఎనర్జీ మరింతగా కనిపిస్తోందని రత్నవేలు చెప్పారు.
గ్రామీణ నేపథ్యంలో కథ
ఈ చిత్రం గ్రామీణ క్రీడల నేపథ్యంతో కూడిన డ్రామాగా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ ఒక రగ్డడ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా సీనియర్ నటులు శివరాజ్ కుమార్, జగపతిబాబు, ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సాంకేతిక పరంగా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు మిగిలిన షూటింగ్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు చివరగా ఉప్పెన అనే వైవిధ్యమైన ప్రేమ కథతో అదరగొట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న పెద్దిపై బుచ్చిబాబు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
రామ్ చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది. దీనితో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పెద్ది టీజర్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ టీజర్ లో రామ్ చరణ్ కొట్టే క్రికెట్ షాట్ ని ఫ్యాన్స్ రీల్స్ రూపంలో రీ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రెండోసారి నటించాల్సి ఉంది.