దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముఖ్య పాత్రల కోసం టాలీవుడ్, బాలీవుడ్ ల నుండి ప్రముఖ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. విద్యాబాలన్.. బసవతారకం పాత్రలో కనిపిస్తుండగా, రానా.. చంద్రబాబునాయుడిగా, సుమంత్.. ఏఎన్నార్ పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ జీవితంలో శ్రీదేవి కీలక పాత్ర పోషించింది. చాలా సినిమాల్లో ఆయనతో కలిసి నటించింది శ్రీదేవి. ఈ బయోపిక్ లో ఆమె ప్రస్తావన కూడా ఉంటుందట. దానికోసం మేకర్స్ ముందుగా బాలీవుడ్ తారలను అనుకున్నట్లు చివరగా రకుల్ ని ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై ఈ చిత్రనిర్మాతలలో ఒకరైన విష్ణు ఇందూరి స్పందిస్తూ..

'శ్రీదేవి పాత్ర కోసం మేము ఏ బాలీవుడ్ హీరోయిన్ ని అనుకోలేదు. మా ఫస్ట్ ఛాయిస్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు చిత్రసీమలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికే సినిమా ముప్పై శాతం షూటింగ్ పూర్తయింది. విద్యాబాలన్ ఆరు రోజుల షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం రకుల్ డేట్స్ తీసుకునే పనిలో ఉన్నామని' అన్నారు. రకుల్.. శ్రీదేవికి పెద్ద అభిమాని. ఆమె పాత్రలో నటించే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది. ఈ పాత్రలో నటించడానికి ఆమె చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.