సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో యాక్టర్ అవ్వడం కోసం తను చాలా ఇబ్బంది పడినట్ల నటుడు రాజ్ కుమార్ రావ్ చెప్పారు. నటుడిగా అతడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్లతో కలిసి నటించడంతో మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. ఇటీవల సిసిల మీడియాలో అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు రాజ్ కుమార్ రావ్.

'షారుఖ్ ఖాన్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఫోటోలు చూస్తూ సినిమా రంగంతో సంబంధం లేని వ్యక్తి సూపర్ స్టార్ అయినప్పుడు నాలాంటి కామన్ మ్యాన్ కూడా ఏదొకరోజు సాధించగలడని నమ్మాను. ముంబైకి రాగానే నాకు పని దొరకలేదు. చిన్న చిన్న యాడ్స్ లో నటించేవాడ్ని. అలా ఎనిమిది నుండి పది వేలు వచ్చేవి. ఒక్కోసారి అవి కూడా ఉండేవి కాదు. దీంతో నా స్నేహితులకు ఫోన్ చేసి భోజనానికి మీ ఇంటికి రావచ్చా అని అడిగేవాడిని. ఇన్ని కష్ఠాలున్నా సినిమా ఇండస్ట్రీని వదలాలనే ఆలోచన మాత్రం రాలేదు.

ఆడిషన్స్ కు వెళ్తూనే ఉండేవాడిని. చిన్న చిన్న పాత్రల కోసం పిలిచేవారు. కానీ నేను పెద్ద పాత్రలకు ఆడిషన్స్ ఇస్తా అని చెప్పేవాడిని. వారు ఒప్పుకునేవారు కాదు. ఓసారి 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' అనే సినిమాలో ఓ పాత్రకు ఆడిషన్స్ ఇచ్చాను. ఆ తరువాత వారం రోజులకి నాకు వారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సెలక్ట్ అయ్యానని తెలియగానే చాలా సంబరపడ్డాను' అని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన 'స్త్రీ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కి జోడీగా రాజ్ కుమార్ రావ్ కనిపించనున్నారు.