మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న `కన్నప్ప` సినిమాని సూపర్ స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ `కన్నప్ప`. ఈ చిత్రానికి వీరిద్దరు నిర్మాతలు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
మంచు విష్ణుతోపాటు డార్లింగ్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి వారు నటిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు రెడీ అవుతుంది.
ఆకట్టుకున్న `కన్నప్ప` ట్రైలర్
చిత్ర ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉంది. ఇప్పటికే చెన్నై, బెంగుళూరు, కొచ్చి, వైజాగ్, ముంబయి సిటీస్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లోనూ పలు ఈవెంట్లకి ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమా యాక్షన్ ప్రధానంగానే కాదు, ఎమోషనల్‌గా సాగుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమయ్యింది. అదే సమయంలో ప్రభాస్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చింది.
`కన్నప్ప` సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్
ఈ నేపథ్యంలో తాజాగా `కన్నప్ప` సినిమాని రజనీకాంత్‌కి చూపించారు మోహన్‌బాబు, మంచు విష్ణు. సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్‌బాబు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. `ఏరా` అని పిలుచుకునేంత స్నేహం వారి మధ్య ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా `కన్నప్ప` సినిమాని రజనీకాంత్‌కి చూపించారు మోహన్ బాబు. ఈ సినిమాని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్ ప్రశంసలు కురిపించారట. సినిమాని, మంచు విష్ణు నటనని ఆయన ప్రశంసించినట్టు తెలిపారు.
రజనీకాంత్ ప్రశంసలపై మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్
రజనీకాంత్ పంచుకున్న అభిప్రాయాన్ని మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. ``కన్నప్ప` చిత్రాన్ని రజినీకాంత్ ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను చూసిన తరువాత నన్ను గట్టిగా హత్తుకున్నారు.
‘కన్నప్ప’ ఎంతో నచ్చిందని ఆయన అన్నారు. ఈ క్షణం కోసం నేను గత 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. నా నటనను ఆయన ఎప్పుడు మెచ్చుకుంటారు.. ఇలా ఎప్పుడు హత్తుకుంటారు అని అనుకుంటూ ఉన్నాను.. ఆ కల ఇప్పుడు నెరవేరింది. నాకు ఈ రోజు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది’ అని అన్నారు మంచు విష్ణు.
`పెదరాయుడు`కి ముప్పై ఏళ్లు
రజనీకాంత్, మోహన్ బాబు కలిసి `పెదరాయుడు` చిత్రంలో నటించారు. ఈ సినిమా 1995 జూన్ 15న విడుదలైంది. మోహన్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ విడుదలై ఆదివారంతో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మోహన్ బాబు, రజనీకాంత్ కలుసుకోవడం విశేషం. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ సమయంలోనే రజనీకాంత్ `కన్నప్ప`ని ప్రత్యేకంగా వీక్షించడం విశేషం.
రజనీకాంత్ ప్రోత్సాహం మర్చిపోలేనిది
దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. `జూన్ 15కి ‘పెద రాయుడు’ రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తయ్యాయి. అదే రోజు నా ప్రియ మిత్రుడు రజనీకాంత్ ‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించారు. ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని చూశారు.
సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ, ప్రశంసలు, ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా’ అని అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన `కన్నప్ప` సినిమా ఈ నెల 27న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
