తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఈ ఇద్దరు స్టార్స్ వచ్చే ఏప్రిల్ లో బాక్సాఫీస్ వద్ద తలపడుతున్నారు. అయితే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా రిలీజ్ తేదీ ముందే ప్రకటించినా.. మహేష్ బాబు సినిమా భరత్ అను నేను అదే తేదీకి రిలీజ్ చేస్తామని నిర్మాత దానయ్య ప్రకటించడంతో ఇద్దరి మధ్యా వార్ మొదలైంది.

 

అయితే వీళ్లిద్దరి రిలీజ్ తేదీలను కన్ఫ్యూజన్ లో పడేస్తూ... 2018 ఏప్రిల్ లో తమిళ సూపర్ స్టార్‌ రజినీ నటించిన రోబో 2.0 రిలీజ్ ఏప్రిల్ 27న ప్లాన్ చేశారు. దీంతో ఇప్పుడు ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ తో, ‘ప్రిన్స్‌’ మహేశ్‌బాబు, ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ల సినిమాలు ఇదే సమయానికి విడుదల చేయాలని ఆయా చిత్రాల దర్శక-నిర్మాతలు నిర్ణయించడంతో బాక్సాఫీసు పోరు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనే ఇదే హాట్‌ టాపిక్‌ గా మారింది.

 

ఇప్పటికే 2.0 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ నెలలో దీన్ని విడుదల చేయనున్నామని లైకా సంస్థ ప్రకటించింది. నిజానికి 2017 దీపావళికి ‘2.ఓ’ను తీసుకువస్తామని నిర్మాతలు తొలుత ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని జనవరి 25కు వాయిదా వేశారు. జనవరిలోపు వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి కావని భావించిన నిర్మాతలు తాజాగా విడుదల తేదీని ఏప్రిల్‌కు ప్రొలాంగ్ చేశారు. ఇలా ఈ సినిమా విడుదల అనుకోకుండా రెండు సార్లు వాయిదా పడింది.

 

 ‘స్పైడర్‌’ తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దీన్ని ఏప్రిల్‌ 27న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత మహేశ్‌-కొరటాల కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి.

 

అల్లు అర్జున్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికగా నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ముందే వెల్లడించింది. ‘సరైనోడు’ విజయం తర్వాత బన్ని నటిస్తున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

 

ఇక తాజా ప్రకటనతో ఏప్రిల్‌లో ‘2.ఓ’ విడుదలపై ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు స్పందించారు. ఈ విషయాన్ని డీవీవీ దానయ్యతో కలిసి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.  అదే విధంగా మహేష్ సినిమా నిర్మాత దానయ్య కూడా దీనిపై ఆలోచించాల్సిన అవసరం వుందని, ట్రేడ్ భాగస్వాములంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు.

 

వీటికి తోడు హాలీవుడ్‌ సినిమా ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ కూడా ఏప్రిల్‌27న భారత్‌లో విడుదల కాబోతోంది. సూపర్‌ హీరోల కథతో భారీ బడ్జెట్‌తో మార్వెల్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌ 24 గంటల్లో 2.30 కోట్ల వ్యూస్‌ను దక్కించుకుని రికార్డు సృష్టించింది. నిజానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 4న విడుదల కాబోతోంది. కానీ కేవలం భారత్‌లో మాత్రమే ఇంకాస్త ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇలా టాలీవుడ్ హీరోల పోటీకి మధ్యలో రజినీ 2.0, ఎవెంజర్స్ రావటంతో బన్నీ, మహేష్ ల సినిమాలకు విడుదల తేదీ మారుతుందా.. అన్నది సందేహాత్మకంగా మారింది.