డిసెంబర్ 26నుంచి రజినీ ఫ్యాన్స్ మీట్.. కీలక ప్రకటన?

rajini fans meet
Highlights

  • గత ఏడు నెలల్లో రెండోసారి రజినీ ఫ్యాన్స్ మీట్
  • తమిళ రాజకీయాల్లో పెను మార్పులకు రంగం సిద్ధం
  • అభిమానులను కలిశాక కీలక ప్రకటన చేయనున్న రజినీ

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులను దేవుళ్లలా భావించే రజినీ... త్వరలోనే ఫ్యాన్స్ మీట్ లో తన అభిమానులను కలవనున్నారు. డిసెంబర్ 26న జరిగే ఈ ఫ్యాన్స్ మీట్ లో తమిళ రాజకీయాలకు సంబంధించి ఓ కీలక ప్రకటన వెలువడే  అవకాశం వుందని తెలుస్తోంది.

 

గతంలో శంకర్ రూపొందించిన శివాజీ మూవీ సక్సెస్ తర్వాత... రజినీ ఇలానే ఫ్యాన్స్ ను కలిశారు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత రీసెంట్ గా అభిమానులతో ముచ్చటించేందుకు రజినీ టైం కేటాయించారు.  మే 15 నుంచి 19వ తారీఖు వరకూ అభిమాన సంఘాల వ్యక్తులతో పలు దఫాలుగా భేటీ అయ్యారు రజినీ. ఆ సందర్భంలోనే యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాక మళ్లీ మిమ్మల్ని కలుస్తానని రజినీ స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే తాజా ఫ్యాన్స్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఇప్పుడు డిసెంబర్ 26 నుంచి 31 వరకు మళ్లీ ఫ్యాన్స్ మీట్స్ ఏర్పాటు చేయడం.. అది కూడా ఐదు రోజులు కేటాయించడం చూస్తే.. ఏదో పెద్ద డెసిషన్ పై మంతనాలు జరిపేందుకే అనుకుంటున్నారంతా. బహుశా రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉందని టాక్.

 

కాగా జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సినీ పరిశ్రమ నననుంచి అటు కమల్ హాసన్, మరోవైపు విశాల్ ఇలా పేరున్న హీరోలు రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తుండటంతో తమిళ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా... రజినీ దాదాపు 1000మంది అభిమానులను కలవనున్నారని, ఈ మీట్ తర్వాత రాజకీయ పార్టీపై స్పష్టతనిస్తారని, కీలక ప్రకటన ఖాయమని అంటున్నారు. అభిమానులు తలైవా రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నా తమ హీరో నిర్ణయమే తమకు శిరోధార్యమని స్పష్టం చేస్తున్నారు. మరి ఈసారి రజినీ ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి.

loader