ఇప్పుడు టాలీవుడ్లో సీనియర్ హీరోలు రూటు మార్చి విలనీజం పండించడం ట్రెండ్గా నడుస్తోంది. ఫ్యామిలీ హీరో జగపతిబాబును బోయపాటి శ్రీను విలన్గా మారిస్తే ఆయనను ఫాలో అవుతూ హీరో శ్రీకాంత్ యాక్షన్ కింగ్ అర్జున్ వంటి హీరోలు విలన్లుగా అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడు ఈ వరుసలో మరో హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. అదీ కూడా ఓ ప్రతిష్టాత్మక చిత్రంతో!

ఆర్ ఆర్ ఆర్- రామ్ చరణ్ - రామారావు - రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. అధికారికంగా ప్రకటించక ముందే ఆకాశాన్నంటే అంచనాలు క్రియేట్ చేసిన చిత్రం ఇదేనేమో. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి - డాక్టర్ రాజశేఖర్ ను కలిసి - కథ వినిపించాడని సమాచారం. రాజశేఖర్ కూడా బలమైన ప్రతినాయకుడి పాత్ర వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎప్పుడో ప్రకటించాడు. ఖైదీ నెం. 150 చిత్రంలో విలన్ రోల్ చేయాలని ఆశపడ్డాడు కూడా. కానీ కుదరలేదు. ఇప్పుడు రాజమౌళి వంటి సంచలన దర్శకుడు ప్రతినాయకుడి పాత్ర ఆఫర్ ఇవ్వగానే వెంటనే ఒప్పుకున్నాడని సమాచారం. రాజశేఖర్ రూపంలో ఈ సినిమాలోకి మరో ఆర్ వచ్చి చేరనుందని టాక్.

రాజమౌళి చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర అంటే ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సై చిత్రంలో బిగ్షూ యాదవ్ గా నటించిన ప్రదీప్ రావత్ - ఒక్కసారిగా తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు. మరి రాజశేఖర్ ఈ చిత్రం తర్వాత ఏ స్థాయి చేరుకుంటాడో చూడాలి. అయితే చిత్రయూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి #RRR.. #RRRRగా  మారుతుందేమో చూద్దాం