Asianet News TeluguAsianet News Telugu

200కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం.. అయినా సినిమాలంటే పిచ్చి: రాజశేఖర్

  • డా.రాజశేఖర్ హీరోగా రూ.25కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గరుడవేగ మూవీ
  • ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్
  • గరుడవేగ ప్రమోషన్ ఈవెంట్ కు సన్నీలియోనీ హాజరు
  • ఈ సందర్భంగా ఎమోషనల్ గా మారిన జీవిత రాజశేఖర్ దంపతులు

 

rajasekhar jeevitha emotional at garuda vega release misssion event

యాంగ్రీ మ్యాన్ డా.రాజ‌శేఖ‌ర్‌ క‌థానాయ‌కుడిగా జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు నిర్మించిన చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం. ఈ మూవీలో పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నవంబ‌ర్ 3న చిత్రం విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం గరుడవేగ రిలీజ్ మిషన్ ఈవెంట్ పేరుతో చిన్న ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్, జీవిత దంపతులు కొద్దిగా ఎమోషన్ అయ్యారు.

 

ఈవెంట్ లో జీవిత మాట్లాడుతూ మన పైన ఏదో సూపర్ పవర్ వుంది. ఆశీర్వదించేందుకు ఇటీవలే చనిపోయిన మా అత్త వుంది. నా గుండె నిండా రాజశేఖర్ కు మంచి సినిమా రావాలని వుంది. ఎంతో బాధ, సెంటిమెంట్, కోరిక, బాధ్యత అన్ని వున్నాయి. రాజశేఖర్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లయింది. గోరింటాకు తర్వాత సరైన సినిమా తీయలేకపోయాం. దానికి ఎన్నో కారణాలు. టైం అలాంటిది. కొంత కాలం మాకు చెడు జరిగింది. కానీ ఇప్పుడు మేం మంచి సినిమా తీయాలనుకున్నాం. దేవుడు సహకరించాడు. నిజానికి మా అత్తగారు గరుడవేగ సినిమా చూస్తానన్నారు. వారం రోజుల్లో అవుతుంది, చూపిస్తాం అని చెప్పాం. కానీ ఆమె వెళ్లిపోయింది. అయినా ఈసారి హిట్ కొడతామని జీవిత అన్నారు.

 

ఇక ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి బయట కొన్ని పుకార్లు వినిపించడం బాధాకరమన్నారామె. ఖచ్చితంగా నవంబర్ 3న గరుడవేగ రిలీజ్ అవుతుందన్నారు. ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ లేవన్నారు. రిలీజ్ కు వంద కోట్లు అవసరమైనా సిద్ధంగా వున్న నిర్మాతలున్నారని... ఎట్టి పరిస్థితుల్లో మా సినిమా అనుకున్న తేదీకి రిలీజై తీరుతుందన్నారు.

ఇక రాజశేఖర్ మాట్లాడుతూ.. తన జీవితంలో విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నానని అన్నారు. మా గరుడవేగ 5రోజులు 5మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడు అమ్మ వుంది. కానీ ఆ నెక్స్ట్ డే చనిపోయారు. క్లౌడ్ నైన్ పై వున్న నేను ఒక్కసారి అమ్మ చనిపోతే.. కుంగిపోయాను. మా అమ్మ ఎప్పుడూ కొడుకు లాస్ అయిపోయాడని బాధ పడేది. దాదాపు 200కోట్ల ఆస్తులు అమ్ముకున్నాం. తమిళంలో సూదుకవుం చూసి ఎంజాయ్ చేసి అది రాంగ్ టైమ్ లో తెలుగులో చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాం. అయ్యో ఎందుకు కొడుకిలా అయిపోయాడు.. అని అమ్మ బాధ పడింది. నేను చివరి దశ వచ్చే సరికి అన్నీ పోగొట్టుకుంటానని అమ్మ బాధ పడింది.

 

నాన్న కూడా సినిమా సొంతంగా చేయద్దన్నారు. దాంతో వచ్చే సినిమాలనే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నా. అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుందని జీవితంలో ఆటాపాటా మానేసి అన్ని మూసుకుని కూర్చున్నా. వస్తారని చూసా. వచ్చారు. చాలా మంది విలన్ గా చేస్తారా అని అడిగారు. 30-40 వచ్చాయి కానీ ఏదీ బాగలేదు. నేను టీజర్ రిలీజ్ సందర్భంగా చెప్పినట్లు ఇది మా ఇంటి పెళ్లి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, అలాగే సినిమా తీసి చూడు అని కూడా అనాల్సింది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మతోపాటు నాన్న కూడా సినిమాలు వద్దన్నారు. దాంతో సైలెంట్ అయిపోయాను.

 

అలాంటి సమయంలో సూపర్ మేన్ లా ప్రవీణ్ సత్తారు.. నాన్న, కోటేశ్వర్ రెడ్డి, ప్రవీణ్, జీవిత గారు. నలుగురు వచ్చారు. అమ్మనాన్న ముందు నేను మళ్లీ పాత రాజశేఖర్ అయ్యానని ప్రూవ్ చేసుకుంటానని అనుకున్నా. కానీ నా దురదృష్టం. పిడుగు పడ్డట్టయింది. అమ్మ వెళ్లిపోయింది. నా సన్నిహితులు చెప్తుంటారు. అమ్మను గుర్తు చేసుకోవద్దని. కానీ ఎలా.. సాధ్యం కాదు కదా.. నాపై పిడుగు పడ్డంతపనైంది. గరుడవేగ హిట్ అవుతుంది. అదంతా కిందకెళ్లిపోయింది. అలాంటి సమయంలో నాకు నాన్న,జీవిత అంతా కమాన్ రా శేఖర్.. అన్నారు.

 

నేను కోలుకోవాల్సిన సమయం. అలాంటి సమయంలో నాకు  కోటేశ్వర్ గారు దొరికారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చారు. తీవ్రంగా నష్టపోయిన సమయంలో కోలుకుని బైటికొచ్చి మళ్లీ సినిమా చేయడం నిజంగా అద్భుతం. కోటేశ్వర్ గారు ఎంతో సహకరించారు. మరి ఇంత కష్టపడి సినిమాలెందుకు తీయాలని అడగొచ్చు. పిచ్చి. ఎంబీబీఎస్ కాగానే సినిమా పిచ్చి పట్టి సినిమాల్లోకొచ్చా. మా కష్టాన్ని అంతా థియేటర్ కు వచ్చి చూడాలని, ముఖ్యంగా మహిళా అభిమానులు నాకు కొంచెం ఎక్కువని విన్నాను. నేను సక్సెస్ అయ్యానని అమ్మకు చూపెదడామనుకున్నా. కానీ అమ్మ వెళ్లిపోయింది. అందుకే తెలుగు అమ్మలందరినీ అడుగుతున్నా. టీవీల్లో ఎలాగూ రేటింగ్స్ ఇస్తున్నారట. కానీ ఈసారి 30కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీశాం. అందరూ సినిమాను థియేటర్ కు వచ్చి చూడాలని కోరుతున్నానని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios