2017 అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును అందుకున్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ వేడుక‌కు ముఖ్య అతిథులుగా సిఎం కేసీఆర్ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు హ‌జ‌ర‌య్యారు అక్కినేని అవార్డ్ ను భారంగా ఫీల‌వుతున్నా అని చెప్పిన‌ రాజ‌మౌళి
నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డును సినీరంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ఇస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికిగాను బాహుబలి చిత్రంతో అంతర్జాతీయ స్థాయి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి అందజేశారు.
ఈ వేడుకు భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేయగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి ఇలా వ్యాఖ్యానించారు.1974లో అక్కినేని నాగేశ్వరరావుగారికి హార్ట్ ఏటాక్ వచ్చింది. పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చి ఆయనకు చికిత్స అందించి పద్నాలుగేళ్లు వరకు ఏ సమస్య లేదని అన్నారు.
పద్నాలుగేళ్లు గడిచిన తర్వాత 1988లో మరోసారి ఆయనకు హార్ట్ ఏటాక్ వచ్చింది. మళ్లీ డాక్టర్స్ ఆయనకు ఆపరేషన్ చేయాలని గుండెను ఓపెన్ చేసి హార్ట్ వీక్గా ఉందని, రక్తాన్ని సరఫరా చేయలేకపోతుందని ఆపరేషన్ చేయడం మానేశారట. ఆ విషయాన్ని ఆయనకు చెప్పి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే బ్రతుకుతారు అని కూడా నాగేశ్వరరావుగారికి చెప్పారు.
డాక్టర్స్ మందుల సహాయంతో పద్నాలుగేళ్లు బ్రతికాను. నా విల్ పవర్తో మరో పద్నాలుగేళ్లు బ్రతుకుతాను అని అప్పుడు నాగేశ్వరరావుగారు అనుకున్నారట. అప్పట్నుంచి ఆయన కారు నెంబర్స్ను 2002గా మార్చుకుని ఆప్పటి వరకు నువ్వు నా దగ్గరకు రాలేవంటూ చావుకు వార్నింగ్ ఇచ్చి ఆయన బ్రతికారు. 2002 వచ్చింది. నేను పద్నాలుగేళ్లు బ్రతుకుతాను అని అనుకున్నాను కదా ఇంకా ఏం కాలేదేంటి అని అనుకున్నారట
ఆ రోజు బయటకు వెళుతూ కారు దగ్గరో పుస్తకంలోనో 9 అనే నెంబర్ చూశారట. సరే నీకు మరో తొమ్మిదేళ్లు సమయం ఇస్తున్నాను అని అనుకున్నారట. ఆయన చావుతోనే మాట్లాడారు. ఆయన క్రమశిక్షణతోనే బ్రతికారు. చివరకు ఆయనకు ఈ ఆట ఆడి విసుగు రావడంతో సరే నువ్వు ఎప్పుడొస్తావో అప్పుడే రా.అని అనుకున్నారు. చివరకు మనల్ని వదలిపెట్టి వెళ్లిపోయారు. కానీ ఆయన కుటుంబం ఆయన్ను అమరుడిని చేసింది.
చావును ఎప్పుడు కావాలంటే అప్పుడు రమ్మని పిలిచిన వ్యక్తులు నాకు తెలిసి ఇద్దరే ఉన్నారు. మహాభారతంలో భీష్ముడు అయితే కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావుగారు. అంతటి మహానుభావుడి పేరు మీదున్న అవార్డును నాకు ఇవ్వడం చూసి నేను ఈ అవార్డుకు అర్హుడినా అనిపిస్తుంది.
నాకు తెలిసి నేను అందుకు అర్హుడిని కాను. నాగార్జునగారు ఇలాంటి గొప్ప అవార్డుని తీసుకున్నప్పుడు మనం ఎగురుతున్నట్లు గొప్ప భావన కలగాలి కానీ నాకు ఈ అవార్డుని స్వీకరించడం భారంలా ఫీలవుతున్నాను. ఇంకా కష్టపడాలి అనే గుర్తు చేయడానికే ఈ అవార్డుని నాకు ఇస్తున్నారనిపిస్తుంది.
