ఎప్పుడైతే #RRR మల్టీస్టారర్‌ చిత్రం అనౌన్స్‌ అయ్యిందో.. అప్పటి నుండి ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కడికోవెళ్లిపోయాయి. రాజమౌళి తారక్‌ చరణ్ లతో ఫోటోను అప్‌ లోడ్‌ చేసినప్పటి నుంచే వీరి చిత్రం స్టోరీ గురించి మీడియాలో రకరకాల కథనాలు వినిపించాయి. ఇదిలా ఉంటే చెర్రీ ఇప్పుడు పెద్ద షాకే ఇచ్చాడు. అసలు ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్‌ ఏదీ సిద్ధం కాలేదని తెలిపారు. 

ప్రస్తుతం రంగస్థలం చిత్ర ప్రమోషన్‌లో పాల్గొన్న రామ్‌ చరణ్‌ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... ‘ఈ చిత్రానికి సంబంధించి  కథ సిద్ధమైందన్న దానిపై నాక్కూడా స్పష్టత లేదు. కేవలం రాజమౌళిని నమ్మే ఆ చిత్రానికి సంతకం చేశాను. అంతేకాదు తారక్‌తో కాంబినేషన్‌ కూడా ఆసక్తికరంగా అనిపించింది. అయితే కథను త్వరలోనే వినిపిస్తానని రాజమౌళి నాతో చెప్పారు’ అని చెర్రీ వెల్లడించాడు. 

మరోవైపు రాజమౌళి మాత్రం కథ నేపథ్యాన్ని ఓకే చేసుకున్నాడని.. స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నాడన్న వార్త ఒకటి వినిపిస్తోంది. ఏది ఏమైనా ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ విషయంలో ఎలాంటి తొందరపాటు పనికి రాదని రాజమౌళి భావిస్తున్నాడనిపిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో లాంఛ్‌ అయ్యే అవకాశం ఉంది. మిగతా తారాగణం.. టెక్నీషియన్ల పేర్లను ఆ సమయంలోనే ప్రకటించనున్నారు.