స్టార్ డైరెక్టర్ రాజమౌళి వంటి దర్శకుల సినిమాలలో కనిపించాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తహతహలాడుతుంటారు. దాదాపు ఇండస్ట్రీలో పేరున్న తారలనే రాజమౌళి తన సినిమాలకు ఎంపిక చేసుకుంటుంటాడు. అలాంటిది ఈసారి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్లుగా రకుల్, కీర్తి సురేష్ లను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ చరణ్, ఎన్టీఆర్ లను తప్ప ఇంకెవరినీ ఫైనల్ చేయలేదని నిర్మాత దానయ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా కొత్త వారిని ఎంపిక చేసే పనిలో పడ్డారని టాక్. సినిమాకు ఫ్రెష్ నెస్ ను యాడ్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మరి రాజమౌళి చేస్తోన్న ఈ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలుకానుంది. ముందుగా ఎన్టీఆర్, ఆ తరువాత రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నారు. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిలిం సిటీలలో సినిమా షూటింగ్ నిర్వహించనున్నారు.