ప్రస్తుతం బాలీవుడ్ జనాలు దక్షిణాది సినిమాలపై విమర్శల జోరు బాగానే పెంచారు. అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి నాలుగు సొమ్ములు చేసుకుపోయిన వారు.. ఇక్కడ పేరు సంపాదించుకున్న తర్వాత అక్కడకు వెళ్లి అవకాశాల కోసం పాకులాడుతున్న వారు కూడా సౌత్ సినిమాల తీరుపై విమర్శలు చేస్తున్నారు. 

బోలెడంత ట్యాలెంట్ తో పాటు డేరింగ్ ఉన్న భామామణిగా గుర్తింపు పొందిన రాధికా ఆప్టే కూడా ఇప్పటికే పలుమార్లు సౌత్ సినిమాలపై కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఈ భామ.. నేహాధూపియా నిర్వహించే కార్యక్రమానికి అటెండ్ అయింది. దక్షిణాదిలో ఆశ్చర్యపోయే విషయాలను చాలానే చూశానంటోంది రాధికా ఆప్టే. 'నేను సౌత్ సినిమాలు చాలానే చేశాను. వాళ్లు చాలా ఎక్కువ మొత్తం పేమెంట్ చేస్తారు. కానీ అంత మొత్తం పుచ్చుకోవడం కరెక్టే అనిపిస్తుంది. అంతగా కష్టపడాల్సి ఉంటుంది' అని చెప్పింది రాధికా ఆప్టే. 

అలాగే సౌత్ సినిమాల్లో పురుషాధిక్యత కూడా ఎక్కువ అనే విషయాన్ని రాధిక అంగీకరించింది. 'అందరూ అలాగే ఉంటారని జనరలైజ్ చేసి చెప్పను కానీ.. నేను పని చేసిన సినిమాల్లో పరిస్థితి అలాగే కనిపించింది. అక్కడ హీరోలు చాలా పవర్ ఫుల్. ఒక షాట్ తీసేందుకు రెండు గంటల ముందే మనం వెళ్లి కూర్చుని వెయిట్ చేయాలి' అంటూ దక్షిణాది సినిమాలు ఆఫ్ స్క్రీన్ లో తమ పవర్ చూపిస్తారని చెబుతోంది రాధికా ఆప్టే.