పెళ్లి చూపులు సినిమాలో తన డైలాగ్ డెలివరీ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న ప్రియదర్శి పెళ్లి జరిగిపోయింది. ఒకపక్క సోషల్ మీడియాతో సహా అన్ని ఛానల్స్ లోనూ శ్రీదేవి గురించిన వార్తలే నిండిపోవడంతో ప్రియదర్శి వివాహం అంతగా హై లైట్ అవ్వలేదు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు రిసెప్షన్ కు హాజరవ్వడం నిండుదనం తెచ్చింది. తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న రిచా వర్మను తనకు జోడిగా పక్కన పెట్టుకుని ఆనందంతో వెలిగిపోతున్న ప్రియదర్శిని పెళ్లి చూపులు టీం మొత్తం వచ్చి విష్ చేసింది. ఈ ఇద్దరిది ప్రేమ వివాహం. రిచా పుట్టిన రోజున తన కవిత్వంతో ప్రియురాలితో పాటు ఫాన్స్ ను ఫిదా చేసిన ప్రియదర్శి మొత్తానికి ఒక ఇంటివాడైపోయాడు.

ఇటీవలే అ! సినిమాలో వంటరాని చెఫ్ గా అసలు పాత్రలే లేని చెట్టు చేపను ఊహించుకుంటూ ప్రియదర్శి నటన తనలో కొత్త కోణాన్ని బయటికి తీసింది. కామెడీ టచ్ ఉన్న పాత్ర లాగే అనిపించినా అందులో ఎమోషన్ ని పలికించిన తీరు మాత్రం అందరిని మెప్పించింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్న ప్రియదర్శి పెళ్లి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి మరొక్క వారం గ్యాప్ లోనే షూటింగ్స్ లో పాల్గొనబోతున్నాడు. ఛాలెంజ్ అనిపించే పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్న ప్రియదర్శికి హీరో పాత్రలు కూడా ఆఫర్ చేస్తున్న నిర్మాతలు వస్తుండటం విశేషం.

హాస్య నటుడిగా ఇంకా తాను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది కనక ఇప్పుడే తొందరపడి అలాంటివి చేయనని చెబుతున్న ప్రియదర్శి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఆలి బ్రహ్మానందం మొదలుకొని సప్తగిరి దాకా అందరు చేసిందే కనక ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ప్రియదర్శిని హీరోగా చూడటం ఆశ్చర్యమేమీ కాదు.