యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వైట్ హౌస్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ నాటు నాటు సాంగ్ ప్రస్తావన తెచ్చారు.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీతో తెలుగు సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం చేశారు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. దీంతో తెలుగు సినిమాతో పాటు నాటు నాటు సాంగ్ అత్యంత ప్రాచుర్యం పొందింది. వివిధ దేశాల్లో ఈ పాటను అనుసరిస్తూ ప్రముఖులు, సామాన్యులు డాన్స్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సౌత్ కొరియా, జర్మనీ ఎంబసీ ఉద్యోగులు ఢిల్లీలో నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేశారు.
ఎల్లలు దాటిన నాటు నాటు సాంగ్ ఏకంగా అమెరికా శ్వేత సౌధంలోకి ప్రవేశించింది. ప్రధాని మోడీ అధికారిక ప్రసంగంలో నాటు నాటు సాంగ్ ప్రస్తావన రావడం విశేషంగా మారింది. యూఎస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ వైట్ హౌస్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల స్నేహం, పరస్పర సహకారంపై ఆయన మాట్లాడారు. ఇండియన్ చిల్డ్రన్ హలోవీన్ వేడుకల్లో స్పైడర్ మాన్ వేషాలు ధరిస్తుంటే... అమెరికన్ యువత నాటు నాటు సాంగ్ కి డాన్స్ చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను మోడీ కొనియాడారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపరచడంలో, ఆర్థిక వ్యవస్థలు బలపరచడంలో సహకారం అందించినట్లు మాట్లాడారు. అమెరికన్ అధ్యక్షుడు పై ప్రశంసలు కురిపించారు. జో బైడెన్ చాలా సౌమ్యులు. చేతల్లో మాత్రం ఘటికులు అని కొనియాడారు. తన పర్యటన విజయవంతం కావడంలో సహకరించిన జో బైడెన్, జిల్ బైడెన్ లకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఇండియాలో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో అర్హత కోసం ప్రయత్నం చేస్తున్న అమెరికన్ టీమ్ కి ప్రవేశం లభించాలి. మా దేశంలో అమెరికన్ టీమ్ క్రికెట్ ఆడాలని శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా పలు అంశాలపై మోడీ ప్రసంగం సాగింది.
