పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన  సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్లో రానున్న మరో సినిమా అజ్ఞాతవాసి. ఆసక్తికరమైన కాంబోతో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి.

 

అజ్ఞాతవాసి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక పాట పాడాడట. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అత్తారింటికి దారేది'లో పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడా' అంటూ పాడిన సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తాజాగా అదే కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న"అజ్ఞాతవాసి" చిత్రంలో కూడా పవన్ కల్యాణ్ ఓ సాంగ్ పాడుతున్నారనే వార్త ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారింది.

 

యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీత సారథ్యంలో పవన్ పాడబోతున్న ఈ పాట ‘కొడకా కోటేశ్వరావా' అనే లైన్స్‌ తో ఉంటుందట. ఈ పాట ఈ చిత్ర ఆల్బమ్‌కే హైలైట్ అనే వార్తలు తాజాగా వ్యాపించడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.

 

ఎప్పడెప్పుడు ఈ సాంగ్‌ని రికార్డ్ చేస్తారా, ఎప్పుడు ఈ సాంగ్ బయటికి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లో ఆడియో విడుదల చేసి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.