పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ మరో వారంలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో పవన్‌ పాత్రకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు జ్యోతికృష్ణ.

పవన్‌ కళ్యాణ్‌ నుంచి సినిమా రాక రెండేళ్లు అవుతుంది. చివరగా ఆయన `బ్రో` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆ తర్వాత `ఓజీ`గానీ, `హరిహర వీరమల్లు` సినిమాని పూర్తి చేసి విడుదల చేయాలనుకున్నారు. 

కానీ ఎన్నికలు రావడంతో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయంగా బిజీ అయ్యారు. ఎన్నికల్లో గెలుపొందడంతో డిప్యూటీ సీఎం అయ్యారు. పరిపాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఇక టైమ్‌ తీసుకుని కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ జీవితాల స్పూర్తితో పవన్‌ కళ్యాణ్‌ రోల్‌

ఈ క్రమంలో మొదటగా `హరిహర వీరమల్లు` సినిమాని పూర్తి చేశారు. ఇది విడుదలకు రెడీ అయ్యింది. ఈ నెల 24న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీనిపై భారీగానే అంచనాలున్నాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు దర్శకుడు జ్యోతికృష్ణ.

 పవన్‌ కళ్యాణ్‌ నటించిన వీరమల్లు పాత్రకి సంబంధించిన క్రేజీ విషయాన్ని పంచుకున్నారు. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొంది పవన్‌ పాత్రని డిజైన్‌ చేసినట్టు వెల్లడించారు. 

ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్‌ కళ్యాణ్ లో ఉన్న గొప్ప లక్షణాలను గమనించిన తర్వాతే వీరమల్లు పాత్రను డిజైన్‌ చేసినట్టు దర్శకుడు జ్యోతి కృష్ణ పేర్కొన్నారు.

ఎంజీఆర్‌ నుంచి ఆ లక్షణం తీసుకున్న `హరిహర వీరమల్లు` దర్శకుడు

ధర్మపరుడిగా, బలవంతుడిగా ప్రజల మనిషిగా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని 'హరి హర వీరమల్లు'లో ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు దర్శకుడు జ్యోతి కృష్ణ తెలిపారు. 

`ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎంజీఆర్ సందేశాత్మక, నిజాయితీతో కూడిన సినిమాలు చేస్తూ నట జీవితాన్ని కొనసాగించారు. ఈ అంశం నాకు స్ఫూర్తినిచ్చింది. అందుకే 'హరిహర వీరమల్లు'లో 'మాట వినాలి' అనే శక్తివంతమైన, ఆలోచింపజేసే పాటను స్వరపరిచాము. 

ఈ పాట సారాంశం పవన్ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ జీవితంలో సానుకూలత, ధర్మాన్ని స్వీకరించడాన్ని తెలియజేస్తుంది. ఈ పాట ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసింది` అని జ్యోతి కృష్ణ అన్నారు.

ఎన్టీఆర్‌ నుంచి స్ఫూర్తి పొందినదే ఇదే 

నటుడిగా ఎన్టీఆర్ గొప్ప ప్రదర్శనలు పౌరాణిక, జానపద చిత్రాల నుండి వచ్చాయి. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు పాత్రలలో ఆయన ఒదిగిపోయిన తీరు చిరస్థాయిగా నిలిచిపోయింది. 

`ఎన్టీఆర్ తన శక్తిని, ధర్మాన్ని నిలబెట్టే సామర్థ్యాన్ని సూచించే విల్లు, బాణం పట్టుకున్న శ్రీరాముడిగా అద్భుతంగా చిత్రీకరించబడ్డారు. ఈ అంశం నుండి ప్రేరణ పొంది, 'హరి హర వీరమల్లు'లో పవన్ కోసం విల్లు, బాణాన్ని రూపొందించాము. 

పవన్ కళ్యాణ్ శక్తిని సూచించడానికి, న్యాయం కోసం పోరాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతీకగా ఈ ఆయుధాలు డిజైన్‌ చేశాం` అని జ్యోతి కృష్ణ తెలిపారు.

 అలాగే తాను స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ప్రజలు పవన్ కళ్యాణ్‌ను కథానాయకుడిగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని గ్రహించానని, కథనాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకంగా సృష్టించాలనుకున్నానని జ్యోతి కృష్ణ చెప్పారు. ఏఎం రత్నం నిర్మించిన `హరిహర వీరమల్లు`లో నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.