పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ, తన సినిమాల కోసం అధికార దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ ఒకరు కోర్టుకెక్కారు.
KNOW
పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఆయన పిటిషన్‌లో, ఈ ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరారు.
విజయ్ కుమార్ తన పిటిషన్‌లో పేర్కొనడం మేరకు, పవన్ కళ్యాణ్ తన సినిమాకు ప్రమోషన్ చేసేందుకు ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను వినియోగించారని ఆరోపించారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని, ఈ చర్యను న్యాయవిరుద్ధంగా ప్రకటించాలంటూ హైకోర్టును కోరారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకుండా నిషేధించాలని అభ్యర్థించారు.
విచారణలో ఏం జరిగిందంటే?
ఈ వ్యాజ్యం సోమవారం (ఆగస్టు 12) హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందించారు. ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. అదేవిధంగా, వ్యాజ్యం మొదటిసారి విచారణకు రావడం వల్ల అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని న్యాయవాది తెలిపారు.
కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జోతిర్మయి ప్రతాప స్పందించారు. సీబీఐ, ఏసీబీ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పేర్లు కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ కారణంగా, ఈ వివరాలను చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.పిటిషనర్ తరఫు న్యాయవాది చేసిన ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ప్రాథమిక విచారణ అనంతరం మాత్రమే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
ముఖ్యమంత్రిగా ఉండి సినిమాలు చేసిన ఎన్టీఆర్
ఈ కేసు నేపథ్యం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తుండటంతో, ఈ ఆరోపణలు, హైకోర్టు విచారణ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గతంలో చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులుగా కొనసాగుతూనే సినిమాల్లో నటించారు. ఆంధ్రుల ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూనే ఎన్నో సినిమాలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.


