ఇటీవల వారం క్రితం ప్రజాక్షేత్రంలో తిరిగిన పవన్ కళ్యాణ్ తను సినిమాలకు గుడ్‌ బై చెబుతాననే స్పష్టమైన సంకేతాలిచ్చారు. స్వయంగా ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో పవన్ సినీ కెరీర్‌పై ఓ కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీంతో అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ వేడుకపై అందరి దృష్టి పడింది.

 

అజ్ఞాత వాసి చిత్రం తర్వాత పవన్ సినిమాపై క్లారిటీ లేదు. అయితే జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన సైనికులతో చర్చలు వేగవంతం చేశారు. సినిమా షూటింగ్ గ్యాప్‌లో రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు పవన్ సిద్దమవుతున్నట్టు తాజాగా అందుతున్న సమాచారం.

 

ఇక జనసేన పార్టీ ఆవిర్భావ ప్రకటన హైటెక్స్ ప్రాంగణంలోనే జరిగింది. ఇప్పుడు అదే ప్రాంగణంలో అజ్ఞాతవాసి ఆడియో వేడుక కూడా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించడం వ్యూహాత్మకమా లేదా యాదృచ్చికమా అనే మాట వినిపిస్తున్నది.

 

ఈ మధ్య కాలంలో పవన్ కల్యాణ్ సినిమాలపై, రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినిమా విజయాలు, సినిమాలు నాకు సంతృప్తిని ఇవ్వవు అని తాజా ఏపీ పర్యటనలో వెల్లడించారు. నీతివంతమైన రాజకీయాలకు స్వాగతం పలుకుదామని యువతకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు, ప్రజా సంక్షేమాన్ని కాలరాస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేసే అంశాలతో సత్యాగ్రహి అనే కథ రాసుకొన్నాను. కానీ సినిమాగా తీయకూడదు అని అనుకొన్నాను. నేను ఓ సత్యాగ్రహి కాకూడదు అని అనుకొన్నాను.

 

సినిమాల వల్ల నేననుకున్నది ఆచరణ సాధ్యం కాదు. వ్యవస్థలు మారవు. అందుకే నిజజీవితంలో నేను సత్యాగ్రహిగా మారడానికి సిద్ధపడ్డాను. 2003లో రాజకీయాల్లోకి రావాలని అమ్మా, నాన్న, అన్నయ్య చిరంజీవికి చెప్పాను. ప్రజారాజ్యంతో నా కలను సాకారం చేసుకోవాలని అనుకొన్నాను. కానీ అది నేరవేరలేదు. జనసేనతో నోటు రహిత రాజకీయాలకు మద్దతు తెలుపుదాం అని పవన్ పిలుపునిచ్చారు.

 

సినిమాలు విజయం సాధిస్తుంటే నాకు ఆనందం లేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరిక రోజు రోజుకు బలంగా మారింది. మీ అందరి సహకారం ఉంటే అది సాధ్యమవుతుంది. నాకు సినిమాలు అసలే ముఖ్యం కాదు అని పవన్ అన్నారు.

 

మరోవైపు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ముహుర్తం షాట్‌కు పవన్ హాజరు కావడంపై పెద్దగానే చర్చ జరిగింది. ఇలాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు చిరంజీవి, జూ. ఎన్టీఆర్‌లు హాజరవుతున్నారనే వార్త మీడియాలో హంగామా సృష్టిస్తున్నది.

 

ఒకవేళ చిరంజీవి, తారక్ అజ్ఞాతవాసి ఆడియోకు హాజరైతే రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర లేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చిరంజీవి జనసేన పార్టీలో చేరుతారని, పార్టీలో కీలక బాధ్యతలను ఆయన స్వీకరిస్తారనే అంశం కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. అజ్ఞాతవాసి ఆడియో ఆవిష్కరణ దీనికి వేదిక కానున్నదా? లేదా మరో సినిమా చేసి సినిమాలకు ముగింపు పలుకుతాడా అనేది కాసేపట్లో తేలనుంది.