జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ వేదికగా బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో... పవన్ రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడో తనకు ఇప్పటికీ అర్థం కాదని వర్మ అభిప్రాయ పడ్డారు.

 

ఈ లేఖలో గతంలో పవన్ కళ్యాణ్ రాసిన పుస్తకం పవనిజం చదివిన తర్వాత తన అభిప్రాయాలను వెల్లడించారు. పవన్ చూపించే నిజాయితీని, స్పష్టమైన దృక్పథాన్ని తాను ఎంతో ఇష్టపడుతానన్నారు. జనసేన పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు కూడా తనను ఎంతో అబ్బురపరిచాయని వర్మ అన్నారు.

 

ఇజం పేరుతో పుస్తకం లాంచ్ చేసినప్పుడు తాను ఎంతో సంతోషించానని వర్మ అన్నారు. చిన్నప్పటి నుండీ పుస్తకాల పురుగునైన నేను.. విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజలో చదివే రోజుల్లో ఇమాన్యుయెల్ కాంత్, ఆర్థర్ స్కాపెనార్, డెస్టార్ట్స్, విలియం హెగెల్, ఫ్రెడ్ రిచ్ నీట్స్, బారుచ్ స్పినోజా, అయాన్ రాండ్ లాంటి ఎందరో ఫిలాసఫర్ల నుంచి నేటి తరం ఫిలాసఫర్ల దాకా ఎంతో ముందు చూపుతో సొసైటీలో మార్పుకోసం కృషిచేసిన తీరును గురించి తెలుసుకున్నాను.

అలాంటి పిలాసఫర్ల ద్వారా గ్రహించిన అంశాలను ఆధారంగా ఇజం పుస్తకంలో మరింత లోతైన విశ్లేషణ వుంటుందేమోననే నమ్మకంతో చదివాను. కాని నన్ను అది తీవ్రంగా నిరాశ పరిచింది. రాజు రవి తేజ్ తో కలిసి మీరు రూపొందించిన ఇజం ఫిలాసఫీని ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు అర్థం చేసుకున్నంత కంటే ఎక్కువ అర్థం చేసుకున్నట్లుగా అనిపించలేదు. మీరు పుస్తకంలో ప్రస్తావించినఅంశాలు, భావాలను చదివాక నాకు ఒక్కటే అర్థమైంది. ఆ ఇజం పుస్తకంలో రాసిన దానికంటే.. మీలో ఎక్కువ జ్ఞానం మీలో అంతర్లీనంగానే ఉంది.అన్నారు వర్మ.

 

మిమ్మల్నిచాలా అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇప్పుడు సమాజానికి కావాల్సింది 100 శాతం పవనిజం. బ్రూస్లీ గొప్ప మార్షల్‌ ఆర్టిస్టే కాదు గొప్ప దార్శనికుడు కూడా. ఆయన ఎప్పుడూ చెప్తుండేవాడు జ్ఞానం అనేది పైకి ఎక్కడానికి ఉపయోగించే నిచ్చెనలా ఉండాలి అని. మనం ఎక్కిన మెట్టును వదిలి మరో మెట్టు ఎక్కుతూ ఉండాలి. అంతేకానీ మనం ఎక్కిన మెట్లన్నీ పోగేస్తే మరింత పైకి వెళ్లలేం. మనల్ని ముందుకు నడిపించేదాన్ని మనం నడిపించకూడదు.


 పవన్‌.. నేను ఇక్కడ బ్రూస్లీ గురించి ఎందుకు ప్రస్తావించానంటే..అతని స్టైల్‌ విభిన్నమైనది. ఎందుకంటే అతను మరొకరిని చూసి నేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. మనమేం ఆలోచించాలన్నా ఏం చెప్పాలన్నా అది మన స్టైల్లోనే ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా మిమ్మల్ని ఒక్కటే వేడుకొంటున్నాను. చెడు విషయాలు, ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. ఆఖరిగా ఒక్కమాట. మీరు రాసిన “ఇజం” పుస్తకం నన్ను నిరాశపరిచింది. కానీ నాకు పవనిజంపై నమ్మకం ఉంది అని పోస్ట్‌ లో పేర్కొన్నారు వర్మ.