పవన్ కళ్యాణ్ నటించిన పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీర మల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. వరుస వాయిదాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.  

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ 

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ చిత్రం విషయంలో అభిమానులకు నిరాశ ఎదురవుతూనే ఉంది. నిర్మాతలు రిలీజ్ డేట్ ప్రకటించడం ఆ తర్వాత వాయిదా వేయడం జరుగుతూనే ఉంది. జూన్ 12నే హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కావలసింది. ఆ తేదికి రావడం పక్కా అని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, ఆర్థిక ఇబ్బందులు కారణం అంటూ ప్రచారం జరిగింది. 

అఫీషియల్ గా కొత్త రిలీజ్ డేట్ ప్రకటన 

ఎట్టకేలకు ‘హరి హర వీర మల్లు’  కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా జూలై 24, 2025 న విడుదలకానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ జోష్ మొదలైంది. కనీసం ఈసారైనా రిలీజ్ డేట్ మిస్ కాకూడదు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత నాలుగేళ్లుగా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధం అయింది. 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా కథానాయకుడిగా డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు. చిత్ర కథ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఉండబోతోంది. ఇందులో పవన్ తనదైన యాక్షన్ స్టైల్‌తో, ప్రజల కోసం పోరాడే వీరుడిగా ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.

 

Scroll to load tweet…

 

విలన్ గా బాబీ డియోల్ 

బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయన టాలీవుడ్ లో తొలి విలన్ రోల్ కావడం విశేషం. అలాగే నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఈ చిత్రం కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రిష్ తప్పుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. 

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పని చేస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా, చిత్ర నిర్మాత ఏ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

రెండు నెలల వ్యవధిలో ఓజి 

పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ, ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు సమయం కేటాయించారు. హరిహర వీరమల్లు రిలీజ్ కి ఇక నెలరోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో చిత్ర యూనిట్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం ఇదే. ఈ మూవీలో అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. 

హరిహర వీరమల్లు విడుదలైన రెండు నెలల వ్యవధిలో పవన్ నుంచి మరో చిత్రం రిలీజ్ కానుంది. ఆ చిత్రమే ఓజి. సుజీత్ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.