ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా నిర్మాత ఏఎం రత్నం పేరుని ప్రతిపాదించినట్టు డిప్యూటీ సీఎం పవన్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట.
KNOW
దర్శక, నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో `హరి హర వీరమల్లు` మూవీని తెరకెక్కించారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. అనేక అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
ఈ నెల 24న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గ్రాండ్ ప్రెస్ మీట్ సోమవారం జరిగింది. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇందులో నిర్మాత ఏఎం రత్నం కష్టం గురించి వెల్లడించారు.
సినిమా అంటే పెద్ద యుద్ధమే చేయాలిః పవన్ కళ్యాణ్
అదే సమయంలో నిర్మాత ఏఎం రత్నంకి ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ని చేయబోతున్నట్టు తెలిపారు. తనవంతుగా రత్నం పేరుని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్టు తెలిపారు పవన్.
ఆయన మాట్లాడుతూ, `అజ్ఞాతవాసి` సినిమాలో త్రివిక్రమ్ ఒక మాట రాశారు. `ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది`. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. నేను సినిమాల్లోకి రాకముందు ఎ.ఎం. రత్నం లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని.
ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి.
రత్నం నలిగిపోతుంటే నాకు బాధగా అనిపించింది
ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్ గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఎ.ఎం. రత్నం తపన చూశాను.
ఒకప్పుడు ఆయన వెంట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు, దర్శకులు తిరిగేవారు. `ఖుషి` సినిమా సమయంలో మాకు ఒక నెల ముందే ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది. మాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తి నలిగిపోతుంటే నాకు బాధేసింది.
ఇది డబ్బు గురించో, విజయం గురించో కాదు.. మన వాళ్ళ కోసం, సినీ పరిశ్రమ కోసం నమ్మి నిలబడటం. నిర్మాతలు కనుమరుగు అవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన నిర్మాతకు అండగా ఉండాలనే ఉద్దేశంతో.. నా బిజీ షెడ్యూల్ వదిలేసి, ప్రత్యర్థులు నన్ను విమర్శిస్తున్నా ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే సినీ పరిశ్రమ నాకు అన్నం పెట్టింది.
ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా ఏఎం రత్నం పేరుని ప్రతిపాదించిన పవన్
రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని.. ఈ సినిమాని నేను నా భుజాలపైకి తీసుకున్నాను. ఒక చిన్న మేకప్ మ్యాన్ స్టార్ట్ అయ్యి.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు రత్నం.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన మౌనంగా ఉంటారు. నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారికి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను.
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. ఓకే అవుతుందని భావిస్తున్నా, ఎందుకంటే అన్నీ నా చేతుల్లో ఉండవు కదా` అని అన్నారు.
ఏఎం రత్నం ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా త్వరలో ఉత్తర్వులు
మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌గా నిర్మాత ఏఎంరత్నం పేరుని ప్రతిపాదించారు పవన్. అయితే ఇది ఆల్మోస్ట్ ఓకే అయ్యిందట. కేవలం అధికారిక ప్రకటనే రావాల్సి ఉందట.
మరో వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తానికి `హరి హర వీరమల్లు` సినిమా వల్ల నలిగిపోయిన నిర్మాత ఏఎం రత్నంకి ఈ రూపంలో పవన్ సహాయం చేయబోతున్నారని చెప్పొచ్చు.


