రేణుని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన పవన్
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ ఇటీవలే మరో వ్యక్తితో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎంగేజ్ మెంట్ ఫోటోలను కూడా రేణు సోషల్ మీడియాలో అభిమానులకు పంచుకున్నారు కూడా. తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆమె గత కొంతకాలం క్రితమే ప్రకటించారు.
కాగా.. పవన్ అభిమానులు మాత్రం ఈ విషయంలో రేణు పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా దాడి చేశారు. వారి మాటల దాడికి ఆమె కూడా సమాధానాలతో ఎదురుదాడి కూడా చేశారు. అంతేకాదు.. తాను అనుకున్నట్టుగానే తన మనసుకు నచ్చిన మరో వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరుపుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా.. రేణూ నిశ్చితార్థం జరిగిన సందర్భంగా.. పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
‘కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు పవన్.
తెలుగులో పవన్‌కు జోడీగా ‘జానీ’, ‘బద్రీ’ చిత్రాల్లో నటించిన రేణూ 2009లో పవన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల 2012లో రేణూ, పవన్ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్..ఆన్నా లెజ్నోవా అనే రష్యా యువతిని పెళ్లిచేసుకున్నారు. రేణూ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణెలో ఉంటున్నారు.
