దీపిక ముక్కు కోసేస్తాం-రాజ్ పుత్ కర్ణిసేన

దీపిక ముక్కు కోసేస్తాం-రాజ్ పుత్ కర్ణిసేన

పద్మావతి సినిమా విడుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న  రాజ్‌పుత్‌ కర్ణిసేన భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. దీంతో పద్మావతి సినిమాపై వివాదం మరింత  ముదురుతోంది. రాజ్‌పుత్‌ కర్ణి సేన మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీపికా పదుకొనె ముక్కు కోస్తామంటూ హెచ్చరించింది. సేన  అధినేత  లోకేంద్ర సింగ్ మీడియా సమావేశం నిర్వహించి మరీ దీపికా పదుకొనెను హెచ్చరించారు.

 

అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పద్మావతి సినిమా విడుదల నిలిపివేయాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్రసమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఒక లేఖ కూడా  రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చిత్రానికి ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేముందు సెన్సార్ బోర్డు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని కూడా సెన్సార్‌ బోర్డు కు సమర్పించాల్సిందిగా సూచించింది.ఈ చిత్ర విడుదల కు వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనం, నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ హోంశాఖ అధికారి అరవింద్‌ కుమార్‌ లేఖలో పేర్కొన్నారు.

 

చిత్రాన్ని ప్రదర్శించవద్దంటూ సినిమా థియేటర్ యజమానులకు కూడా బెదిరింపు లేఖలు కూడా వస్తున్నట్లు గుర్తు చేశారు. ఈనెల 22, 26, 29 తేదీల్లో ఉత్తరప్రదేశ్  లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వాటికి డిసెంబర్ 1న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇలాంటి కీలక సమయం లో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం  భావిస్తోంది.

 

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న పద్మావతి చిత్రంపై రాజ్‌పుత్‌ వర్గీయులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అల్లావుద్దీన్‌ ఖిల్జీ, రాణి పద్మావతి మధ్య అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సహించేది లేదని, సినిమా విడుదలకు ముందే తమకు చూపించాల్సిందిగా రాజ్‌పుత్‌ కర్ణిసేన కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. దీపికా పదుకొనె, రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కావల్సి వుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page