పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ‘ఓజి’ ప్రాజెక్టుకు సమయం కేటాయించి పూర్తి చేశారు. ఈ చిత్ర సీడెడ్ హక్కులకు సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ఓజి మూవీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం 'ఓజి’. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు.
భారీ ధరకి సీడెడ్ హక్కులు
ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న నేపధ్యంలో తాజా అప్‌డేట్ మరింత ఆసక్తిని పెంచింది. యువ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నాగ వంశీ, ఈ చిత్రానికి చెందిన సీడెడ్ హక్కులను రూ.24 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఒక రీజియన్‌కి ఇంత భారీ రేటు చెల్లించడంతో ఓజి చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సీడెడ్ రైట్స్ డీల్ ముగిసిన తర్వాత మిగతా రీజియన్లలో ప్రీ-రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగవంశీ పవన్ కళ్యాణ్ తో గతంలో భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించనున్నారు. అలాగే అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, షామ్, శ్రియా రెడ్డి వంటి నటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సంగీతం ఎస్.ఎస్. థమన్ అందించనున్న ఈ చిత్రానికి యాక్షన్, ఎమోషన్, కలబోసిన కథనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేయనున్నట్టు తెలుస్తోంది.
ఓజి షూటింగ్ పూర్తి చేసిన పవన్
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ‘ఓజి’ ప్రాజెక్టుకు సమయం కేటాయించి పూర్తి చేశారు. ఈ సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా టైమ్ అలోకేట్ చేయడమే కాకుండా, ఫిజికల్‌గా కూడా సీరియస్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయినట్లు సమాచారం.
సాహో తర్వాత సుజీత్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఆ మధ్యన విడుదలైన ఓజి టీజర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ చిత్రం 2025లోనే టాప్ గ్రాస్ చేసే సినిమాలలో ఒకటిగా నిలవబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తిరిగి ప్రారంభం
ఓజి తర్వాత పవన్ తన మరో పెండింగ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టారు. చాలా రోజుల తర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్.
మరోవైపు పవన్ ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. జూన్ 12న రిలీజ్ పక్కా అని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డేట్ కి కూడా హరి హర వీరమల్లు రాలేదు.
