Asianet News TeluguAsianet News Telugu

NTR: `అదొక అరాచక పాలనకు నాంది`.. ఎన్టీఆర్‌ సంచలన వ్యాఖ్యలు.. ఆ సంస్కృతిని కాల్చేస్తున్నారంటూ ఆవేదన

టీడీపీ శ్రేణులతోపాటు నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్‌ స్పందించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న  నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన స్పందించారు. 

ntr sensational comments on yesterday what happen in ap assembly
Author
Hyderabad, First Published Nov 20, 2021, 4:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఎన్టీఆర్‌ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆడపడుచులను పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అదొక అరాచక పరిపాలకు నాంది పలుకుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదన చెందడంతోపాటు తన ఆవేశంతో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌గా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు(YSRCP Leaders) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు నాయుడు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను అసెంబ్లీలో కాలుపెట్టనని, మళ్లీ సీఎం అయిన తర్వాతనే అసెంబ్లీలోకి వస్తానని శపథం చేయడం సంచలనంగా మారింది. 

ఈ నేపథ్యంలో దీనిపై టీడీపీ శ్రేణులతోపాటు నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలకృష్ణ, కళ్యాణ్‌ రామ్‌ స్పందించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌(NTR) సైతం తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు NTR స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్న  నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సంస్కృతిని కాల్చేస్తున్నారంటూ వాపోయారు. 

వీడియోలో ఎన్టీఆర్‌ చెబుతూ, `మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రజా సమస్యలపైనే జరగాలి.  వ్యక్తిగత దూషణలు, విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసుని కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అదొక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది.  స్త్రీ జాతిని గౌరవించడమనేది, ఆడపడుచులను గౌరవించడమనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఉన్న ఒక సంప్రదాయం. 

మన సంప్రదాయాలను రాబోయే తరానికి జాగ్రత్తగా, భద్రంగా అప్పజెప్పాలే గానీ, మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి.. రాబోయే తరానికి బంగారు బాట వేస్తున్నామనుకుంటే అదొక పెద్ద తప్పు. అది మనందరం చేసే పెద్ద తప్పు. ఈ మాటలు.. ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబ సభ్యుడిగా మాట్లాడటం లేదు. ఈ మాటలు నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగు వాడిగా మాట్లాడుతున్నా. రాజకీయ నాయకులకు నా ఒక్కటే విన్నపం. దయజేసి ఇలాంటి అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నా` అని ఎన్టీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ వెకేషన్‌ నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. మరోవైపు ఆయన నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.  ఇందులో రామ్‌చరణ్‌ మరో హీరోగానటిస్తుండగా, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా ఇది పదికిపైగా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్‌ కాబోతుంది.  

also read: కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడవు, నీకు పార్టీ పగ్గాలు కావాలా?... ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఫ్యాన్స్!

also read: `చంద్రబాబు` ఘటనపై హీరో కళ్యాణ్‌ రామ్‌ ట్వీట్‌.. మహిళని కించపర్చడం సరికాదంటూ హెచ్చరిక

Follow Us:
Download App:
  • android
  • ios