రాజకీయ పార్టీ పెట్టే అవసరం నాకు లేదన్న జూనియర్ ఎన్టీఆర్ అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఉందని స్పష్టం చేసిన తారక్ నవ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షునిగా నియమిస్తామని వచ్చిన లేఖపై స్పందన

తెలుగుదేశం పార్టీలో జూనియార్ ఎన్టీఆర్-హరికృష్ణ కుటుంబసభ్యులకు, సీఎం చంద్రబాబు-బాలయ్య కుటుంబ సభ్యులకు అభిప్రాయ బేధాలున్నాయని టాక్ అందరికీ తెలిసిందే. అయితే అంత అవసరమొస్తే తాత తెలుగుదేశం పార్టీకి వారసునిగా తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయాల్లో కొనసాగుతా తప్ప మరో పార్టీ పెట్టి రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. గత కొంత కాలంగా తన సినిమాలేదో తను చేసుకుంటూ వెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు సడెన్ గా రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాడంటే..

జూనియర్ ఎన్టీఆర్‌ను ‘నవ భారత్ నేషనల్ పార్టీ’కి ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నామంటూ ఓ లేఖ నెట్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘జైలవకుశ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్.. ఈ విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వేశాడట. తాను ఇటువంటి వార్తలను పట్టించుకోబోనని వారికి చెప్పాడట.

ఈ వార్తలను ఎవరూ పట్టించుకోవద్దని, వదిలేయాలని అభిమానులకు సూచించాడట తారకరాముడు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల మీదేనని చెప్పాడట. తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమేమీ లేదని, ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే తానే స్వయంగా బహిరంగ ప్రకటన చేస్తానని అతడిని కలిసిన అభిమానులకు వివరించాడట. వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రహస్యంగా రాజకీయాల్లోకి వచ్చే అవసరం తనకు లేదని వారితో కామెంట్ చేశాడట. మొత్తానికి తనపై వస్తున్న రాజకీయ ప్రచారానికి అభిమానులతో తారక్ ఇలా చెక్ పెట్టాడని ఫిల్మ్‌నగర్లో టాక్.