ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు తర్వాత చేయబోయే టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అప్ డేట్స్ తీసుకుంటూనే ఉన్నారు. రాజమౌళి దీని గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ షూటింగ్ ప్రారంభోత్సవం వరకు ఇది ఇలాగే గోప్యంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారట.  ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోంది అనే వార్తే అప్పట్లో కలకలం రేపింది. రియల్ మల్టీ స్టారర్ అంటూ ఫాన్స్ కూడా ఉద్వేగాన్ని షేర్ చేసుకున్నారు. మొదలుపెట్టడానికి ఇంకా ఎలాగూ సమయం ఉంది కాబట్టి ఆ లోపు తమ ఇద్దరి బాండింగ్ ని ఇంకా బలంగా మార్చుకునే పనిలో పడ్డారు ఈ ఇద్దరు మిత్రులు.

ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం తారక్ చరణ్ ఇద్దరు కలిసి ఒక హాలిడే ట్రిప్ కోసం యూరోప్ వెళ్ళబోతున్నారు. తారక్ భార్య ప్రణతి ప్రసవం కాగానే ఇది ఉండొచ్చని టాక్. వీరితో పాటు రాజమౌళి కూడా జాయిన్ అయ్యి తాము అనుకున్న ప్రాజెక్ట్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటి దాకా రాసుకున్న స్క్రిప్ట్ ముగ్గురికి సింక్ అయ్యేలా ఉందా లేదా అనే చర్చలు కూడా చేస్తారట. త్రివిక్రమ్ సినిమా కోసం తన ఒంటిని వింటిలా మార్చి జిమ్ లో కష్టపడుతున్న తారక్ అదే లుక్ అలాగే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అంత హైప్ వచ్చే సినిమాగా దీని మీద అప్పుడే ట్రేడ్ రకరకాల అంచనాలు మొదలుపెట్టుకుంది.

మల్టీ స్టారర్స్ ట్రెండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతోనే ప్రారంభమైనప్పటికి ఒకే జెనరేషన్ స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకుల కోరిక. ఆ రకంగా చరణ్- ఎన్టీఆర్ సినిమా కొత్త చరిత్రకు నాంది పలికినట్టే. అప్పుడెప్పుడో ఎన్టీఆర్-ఎఎన్ ఆర్ కలిసి 14 సినిమాల్లో కలిసి నటించారు. 80 దశకం దాటాక రెండో తరం నుంచి ఇవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇది ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో ఉంది టాలీవుడ్.