ఆదివారం తెల్లవారుజాము నుంచి నిన్న రాత్రి వరకూ అందరి నోటా శ్రీదేవే. ఇక.. టీవీలు ఆన్ చేసి న్యూస్ ఛానళ్లు ఓపెన్ చేస్తే చాలు.. శ్రీదేవి.. శ్రీదేవి.. శ్రీదేవి తప్ప మరింకేమీ పెద్ద ఫోకస్ కాలేదని చెప్పాలి. తను ఎక్కడి నుంచి వచ్చి మన అందరినీ తన అందంతో మురిపించిందో.. మళ్లీ అక్కడికే చేరిపోయిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 4 ఏళ్ల వయసులో నటన ప్రారంభించిన శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో భువిని వదిలేసింది.

బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించిన శ్రీదేవి.. స్వర్గీయ ఎన్టీఆర్ కు మనవరాలిగా కూడా యాక్ట్ చేసింది. అయితే.. తాతా అని పిలిచిన అదే నోటితోనే.. తిరిగి ఎన్టీఆర్ తో జట్టు కట్టి డ్యాన్సులు కూడా వేసింది. ఆయనకు మనవరాలిగా యాక్ట్ చేసిన అమ్మాయిని.. హీరోయిన్ గా నటింపచేయాలనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు వచ్చింది. కానీ ఈ విషయం ఆయనకు చెప్పడం ఎలా అన్నదే పాయింట్. వేటగాడు మూవీలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయిన ఆయన.. ముందుగా ఆ విషయాన్ని ఎన్టీఆర్ తో చెప్పేందుకు ఎలాగోలా ధైర్యం చేశారు.

సినిమాకు అన్నీ ఓకే కానీ.. హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకుందామని భావిస్తున్నామని.. కానీ ఆమె వయసు 14 సంవత్సరాలే అని చెప్పారట రాఘవేంద్రరావు. దానికి ఆయన నుంచి వచ్చిన ఆన్సర్ మరీ అబ్బురపరిచింది. 'దాందేముంది బ్రదర్.. మా వయసూ పధ్నాలుగు ఏళ్లే కదా' అంటూ నవ్వేశారట ఎన్టీఆర్. మొదటగా ఆకుచాటు పిందె తడిసి అనే పాటను తీసి.. ఓకే అనుకున్నాక మిగిలిన చిత్రాన్ని తెరకెక్కించారట. అలా ఓ అపురూపమైన కాంబినేషన్ రూపొందింది. ఆ తరువాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం శ్రీదేవికి రాలేదు.