Asianet News TeluguAsianet News Telugu

నేను లెస్బియన్ ను.. తప్పు అనిపించలేదు: నిత్యమీనన్

  • అ! చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నిత్యమీనన్
  • ఈ చిత్రంలో క్రిష్ అనే పాత్రలో నటించిన నిత్య
  • క్రిష్ పాత్రలో లెస్బియన్ గా నటించడం తప్పనిపించలేదన్న నిత్య
  • తాజాగా పలు ఆసక్తికర అంశాలు మీడియాతో పంచుకున్న నిత్య
nithya menon reveals her lesbian role in awe

ఏదో ఒక ప్రత్యేకత లేనిదే పాత్రలకు ఓకే చెప్పని తత్వం వున్న విలక్షణమైన నటి నిత్యమీనన్. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఆకట్టుకొంటున్న నిత్యామీనన్ కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే కనిపిస్తారు. ఆమె నటించే పాత్రల్లో ఆమె మార్కు కనిపిస్తుంది. నిత్యమీనన్ తాజాగా నటించిన అ! చిత్రంలో స్వలింగ సంపర్కురాలిగా వెరైటీ పాత్రలో కనిపించింది. తాజాగా ఆ చిత్రం నేపథ్యంలో తన అనుభవాలను, అభిప్రాయాలను నిత్య మీడియాతో పంచుకుంది.

 

కథ విన్నప్పుడు...

అ! చిత్రం కథ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. సాధారణంగా చాలా కథలు వింటాం. కానీ ఇలాంటి స్టోరి వినడం చాలా రేర్. ఎప్పడూ రొటీన్ పాత్రలు చేస్తుంటాం. ఒక పాత్ర చేస్తే అలాంటి పాత్రలు వస్తుంటాయి. అ! చిత్రంలోని క్రిష్ లాంటి పాత్రను దర్శకుడు చాలా కొత్తగా మలిచాడు. అదే విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. కథ చెప్పగానే నేను ఎగిరి గంతేస్తానని నాని చిత్ర దర్శకుడు ప్రశాంత్‌తో చెప్పిన మాట వాస్తవమే. నాకు క్రేజీ క్యారెక్టర్లు చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. ఒకేరకమైన పాత్రలు చేయడం ద్వారా బోర్ కొడుతుంది. అందుకే క్రిష్ పాత్రను ఒప్పుకొన్నాను.

 

నాని కోసమేనా...

అ! చిత్రాన్ని హీరో నాని కోసం చేయలేదు. కథ నచ్చే చేశాను. అందరం ప్రశాంత్ కోసమే చేశాం. ప్రశాంత్ రెండోసారి కలిసినప్పుడు నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నారని ప్రశాంత్ చెప్పారు. ముందుగా రాధ క్యారెక్టర్, ఆ తర్వాత క్రిష్ పాత్ర గురించి చెప్పారు. అయితే నేనే క్రిష్ పాత్రను ఎంచుకొన్నాను. ఈ పాత్ర కోసం ఎలాంటి వర్కవుట్ చేయలేదు.

 

లెస్బియన్ గా...

ఆ చిత్రంలో నేను లెస్బియన్ ను. స్వలింగ సంపర్కురాలి(లెస్బియన్) పాత్రలో కనిపించడం కెరీర్‌ కు ఇబ్బందవుతుందని అనిపించలేదు. క్రిష్ పాత్రను చేసేటప్పుడు నేను ఆలోచించలేదు. ఇప్పుడు కూడా ఆలోచించడం లేదు. అది తప్పని నాకు అనిపించలేదు. ఒక నటిగా అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోలేదు. నటిగా నాకు ఛాలెంజ్ ఉన్న పాత్ర అనిపించింది. అందుకే చేశాను. క్రిష్ పాత్ర చేసే ముందు కొంచెం కన్‌ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. మనం చేసే సినిమాల్లో ముందే ప్రిపేర్ అయ్యేంత స్కోప్ ఉండదు. క్రిష్ క్యారెక్టర్ చేయడానికి ముందు నాకు అలాంటి అనుభవం లేదు. షూట్‌కు ముందు ఎలా చేస్తానో అని ఆందోళన పడ్డాను. కానీ కెమెరా ముందుకు వెళితే దానంతట అదే వస్తుందని అనుకొన్నాను.

 

సమాజంపై క్రిష్ ప్రభావం...

అ! చిత్రంలోని క్రిష్ అనే లెస్బియన్ పాత్ర సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. నేను ఒక పాత్రను ఒప్పుకునేటప్పుడు దాని గురించి బాగా ఆలోచిస్తాను. నా పాత్ర సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ముందుగానే ఆలోచిస్తాను. సమాజాన్ని ఓ మంచి మార్గం వైపు నడిపించాల్సిన బాధ్యత నటిగా నాపై ఉంది. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా సమాజంపై కొంత ప్రభావం ఉంటుంది.

 

టాలీవుడ్ పై అ! ప్రభావం...

అ! చిత్రం టాలీవుడ్‌పై భారీగా ప్రభావం చూపుతుంది. ఈ చిత్రం తర్వాత కొత్త తరహా చిత్రాలు రావడానికి అవకాశం ఉంటుందని అనుకొంటున్నాను. ఎందుకంటే అందరికి నచ్చే సినిమాలు చేయడమనేది, ఒకే రకమైన సినిమాలు చేయడం అనేది బోరింగ్ ఉంటుంది. టాలీవుడ్ పరిశ్రమ పరిధి చాలా విస్తృతమైంది. దానిని తగినట్టుగా సినిమాలు రావాల్సిన అవసరం ఉంది.

 

కథల ఎంపిక...

స్క్రిప్టు నచ్చితేనే సినిమాలు చేస్తాను. నా కెరీర్‌లో దాదాపు 200 కథలు విని ఉంటాను. కానీ నేను చేసింది 10కి మించి ఉండవు. నాకు ఏదో ఒక పాయింట్ నచ్చాలి. అప్పుడే నేను సినిమాకు ఓకే చెబుతాను. నచ్చకపోతే నేను అప్పుడే నో చెబుతాను. స్క్రిప్టు నచ్చితే దానిని మరింత బాగా చేయడానికి నేను అందులో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తాను. డైలాగ్స్ కూడా రాస్తాను.

 

ఫ్యూచర్ ప్రాజెక్టులు...

ప్రస్తుతం నేను చేస్తున్న ప్రాజెక్ట్ ప్రాణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రచనా సహకారం అందించాను. ఆ చిత్రం కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్నాం. నాలుగు భాషల గురించి నాకే బాగా తెలుసు. అందుకే స్క్రిప్టులో ఇన్‌వాల్వ్ అవుతాను. సాధారణంగా నేను ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తుంటాను. కొన్ని ఫినిష్ అవుతాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios