Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: నేల టికెట్టు

'సోగ్గాడే చిన్ని నాయన'.'రా రండోయ్ వేడుక చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్

nela ticket movie review

నటీనటులు: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, సంపత్ రాజ్ తదితరులు 
సంగీతం: శక్తికాంత్ కార్తిక్ 
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ 
నిర్మాతలు: రామ్ తాళ్లూరి
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల 

'సోగ్గాడే చిన్ని నాయన'.'రా రండోయ్ వేడుక చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కొంత గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ మాస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
టైటిల్ కు తగ్గట్లుగా సినిమాలో హీరో పేరు నేల టికెట్ అన్నమాట. అతడు ఓ అనాధ. ప్రతి మనిషిని తన మనిషని అనుకుంటుంటాడు. అందరినీ వరుసలు పెట్టి పిలుచుకుంటూ కలిసిపోతుంటాడు. వారికోసం ఎంత రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. అలా ఓ పోలీస్ తో గొడవ పెట్టుకొని హైదరాబాద్ కు వచ్చేస్తాడు. సిటీకి రాగానే మాళవిక(మాళవిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఓదశలో హోం మినిస్టర్ ఆదిత్య భూపతి(జగపతి బాబు)మనుషులతో గొడవపడతాడు. డబ్బు కోసం ఏదైనా చేసే ఆదిత్య చేసే పనులకు కావాలనే అడ్డు పడుతుంటాడు. అసలు మినిస్టర్ ను ఓ సాధారణ వ్యక్తి అయిన నేల టికెట్ ఎందుకు టార్గెట్ చేస్తాడు..? వీరిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి..? మినిస్టర్ చేసే దుర్మార్గాలకు నేల టికెట్ ఫుల్ స్టాప్ పెట్టాడా..? అనేదే మిగిలిన సినిమా. 


కళాకారుల పనితీరు: 
రవితేజకు ఈ సినిమా ఏ రకంగానూ ప్రత్యేకమైన సినిమా కాదు. రవితేజకు తనకు అలావాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే గతంలో రవితేజ చేసిన తరహా రొటిన్‌ సీన్స్ లో కనిపించటంతో కొత్తదనమేమీ కనిపించదు. పైగా అతడి లుక్ తేడాగా ఉండి.. కనిపించిన ప్రతిసారీ ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. సాధారణ సన్నివేశాలైనా కానీ కామెడీసీన్లనే సరికి రవితేజ తనదైన శైలిలో నిలబెట్టేస్తాడు. కానీ ద్వితియార్ధంలో అతని క్యారెక్టర్‌ని సీరియస్‌గా మార్చేయడంతో కనీసం కామెడీతో అయినా రవితేజ దీనిని కాపాడే అవకాశంలేకుండా చేశారు. అంటే రవితేజ పవర్‌ఫుల్‌ సీన్లు పండించలేడని కాదు. హీరోయిన్ మాళవిక శర్మ తెరపై అందంగా కనిపించింది. కానీ నటన పరంగా పెద్దగా ఆకట్టుకోదు. బ్రహ్మానందం, అలీ, పోసాని, పృధ్వీ వంటి కమెడియన్లను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. జగపతి బాబు నటన పరంగా ఆకట్టుకున్నా.. అతడి పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. సంపత్, సురేఖా వాణి వంటి తారలు తమ పాత్రల పరిధులలో చక్కగా నటించారు. 

సాంకేతికవర్గం పనితీరు: 
పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్‌ప్లే పరంగా అవుట్‌డేటెడ్‌ ఫార్మాట్‌లో వున్న ఈ సినిమా టెక్నికల్‌గా, టేకింగ్‌ పరంగా కూడా పాత పద్ధతులనే అవలంబించడం వల్ల కొత్తదనం అనేది మాట వరసకి కూడా లేకుండా పోయింది. ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. యాక్షన్ సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ కు ముందు ప్లాన్ చేసిన భారీ యాక్షన్ సీన్ కూడా తెరపై పండలేదు. 

కథనం-విశ్లేషణ: 
బాగా పాతబడిపోయిన రొటీన్ కథ.. దానికి తగ్గట్లే సాగే కథనం.. కళ్యాణ్ కృష్ణ లాంటి దర్శకుడి నుంచి ఆశించే ఏ కొత్తదనం లేని నేరేషన్.. వెరసి ఈ సినిమా ఏ రకంగానూ మెప్పించని సినిమాగా నిలుస్తుంది. గతంలో ఊహించడానికి కూడా భయపడే వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతూ.. వాటికి అద్భుత విజయాలు కట్టబెడుతున్న రోజుల్లో కొన్నేళ్ల కిందటే ఔట్ డేటెడ్ అనిపించే తరహా కథతో దర్శకుడు చేసిన ప్రయత్నం ఎవరిని మెప్పించడానికో అర్థం కాదు.ఎంత రొటీన్ కథ అయినా.. సినిమా ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోయినా.. కొంచెం ఎంటర్టైన్మెంట్ మత్తులో అయినా ముంచెత్తితే ప్రేక్షకుడు మన్నిస్తాడు. కానీ అసలు కథ మొదలవడానికి ముందు ప్రథమార్ధంలో సాగే రొమాంటిక్ ట్రాక్ ఎంటర్టైన్ చేయకపోగా విసిగిస్తుంది. చాలా పేలవంగా రాసిన ఈ ట్రాక్ ను.. అంతే పేలవంగా తెరకెక్కించారు. సినిమా మీద ఆసక్తిని ఈ ఎపిసోడే సగం చంపేస్తుంది. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు తీసింది ఈ చిత్ర దర్శకుడేనా? అనే సందేహం కలుగుతుంది. ఇద్దరు వేర్వేరు పరిస్థితుల్లో పెరిగిన అనాధల మధ్య  జరిగే సంఘర్షణతో రాసుకున్న ఈ కథ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా తెరపై ఆవిష్కరించలేకపోయారు. ట్విస్టులు అన్నీ కూడా ఊహాజనితంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో గానీ, సెకండ్ హాఫ్ లో గానీ ఇది హైలైట్ సీన్ అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఇక క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. కథలో కంటెంట్ లేకపోయినా రవితేజ తన నటనతో కామెడీతో కాస్త ఎంటర్టైన్ చేస్తాడు కానీ ఈసారి అది కూడా మిస్ అయింది. 

రేటింగ్: 1.5/5 
 

Follow Us:
Download App:
  • android
  • ios