ఎలాంటి అందాల ఆరబోత లేకుండా.. కేవలం కన్నుకొట్టి పరిచయం అవసరం లేనంత పాపులారిటీ తెచ్చుకుంది మలయాళీ భామ ప్రియ ప్రకాశ్‌ వారియర్‌. ఎంతగా అంటే ఆమె పేరుకి ముందు ‘వింక్‌ గర్ల్‌’ అన్న బిరుదును జోడించేంతలా. ప్రియ కొంటె చూపునకు ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులూ ఫిదా అయిపోయారు. కొందరు ప్రియ నవ్వు బాగుందంటూ ప్రశంసలు గుప్పిస్తే.. మరికొందరు ఆమెను అనుసరిస్తూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు.

 

మొన్నటికి మొన్న స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. కుమారుడు అయాన్‌తో కలిసి ప్రియ ప్రకాశ్‌ను అనుకరిస్తూ పోస్ట్‌ చేసిన వీడియో తెగ వైరలైంది. ఇప్పుడు ప్రముఖ గాయని నేహా కక్కర్‌ తన కొంటెచూపుతో అభిమానుల్ని ఫిదా చేశారు. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలో అచ్చం ప్రియ ప్రకాశ్‌ నవ్వినట్లే నవ్వుతూ తుపాకీ గురి పెడుతున్నట్లుగా నేహా ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశారు. ‘ప్రియ ప్రభావం నాపై పడింది. కాకపోతే గన్ను ఉల్టా అయిపోయింది’ అని సరదాగా క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

 

ఇక ఈ వీడియోకు విపరీతంగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ప్రియ వీడియోను ఒక్కరోజులో 40 లక్షలకు మందికి పైగా వీక్షిస్తే.. నేహా వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. కన్ను కొట్టడం బాగా ప్రాక్టీస్‌ చేయాలని కొందరు... ఆ నవ్వుతో ప్రియ రికార్డును బద్దలుకొట్టిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. హిందీలో ‘కాలా చష్మా’లాంటి వేలాది సూపర్‌ హిట్‌ పాటలతో పాటు తెలుగులో నాగార్జున నటించిన ‘కేడి’ చిత్రంలోని ‘నీవే నా నీవే నా’ పాటకు నేహా గాత్రం అందించారు.