నందమూరి వంశంలో బాలకృష్ణ తరువాత ఆ స్థాయికి చేరింది జూనియర్ ఎన్టీఆరే. కళ్యాణ్ రామ్ ఒకటి అరా సినిమాలు అప్పుడప్పుడు చేసుకుంటూ పోతున్నాడు.  హరికృష్ణ మూడు నాలుగు సినిమాలలో మెరిసి కనుమరుగై పోయారు. ఇప్పుడు వీరి ముగ్గురిని ఒకే తెరపై కలిపి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుకున్నట్టు జరిగితే... తండ్రీ కొడుకులు త్వరలోనే ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. 

సావిత్రి - ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాలకు దర్శకత్వం వహించిన పవన్ సాధినేని... కళ్యాణ్ రామ్ హీరోగా సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నాడు. అతని కథకు కళ్యాణ్ రామ్ కూడా ఓకే చెప్పాడు. అది ఒక ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. మంచికి - దురాశకు మధ్యలో సాగే కథ. తెలిసిన సమాచారం ప్రకారం... ఆ సినిమాలో హరికృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ ను పెట్టాలన్నది దర్శకుడి కోరిక. వారిద్దరిని అతిధి పాత్రలో చూపించి... మెయిన్ హీరోగా కళ్యాణ్ రామ్ నటిస్తాడు.  ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కనుక అతనే తండ్రిని - తమ్ముడిని ఒప్పిస్తాడనే నమ్మకం పెట్టుకుంది చిత్రయూనిట్. అదే జరిగితే.... సినిమా కమర్షియల్ గా హిట్ కొడుతుందని వారి ఆశ. 

మనం సినిమాలో అక్కినేని నాగార్జున వారసులంతా కనిపించారు.  నందమూరి హరికృష్ణ కూడా తన ఫ్యామిలీ స్టారర్ సినిమా చేసేందుకు ఒప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే - నా నువ్వే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక పవన్ సాధినేని సినిమాపై దృష్టి పెడతాడు.