నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో కొత్త మూవీ గతంలో శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ,నాగ్ కాంబో తిరిగి అంతకుమమించిన అద్భుతమైన చిత్రాన్నిస్తామంటున్న వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివ సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఈ కాంబినేషన్ 28 ఏళ్ల తర్వాత మళ్లీ చేతులు కలిపారు. ఈ ఇద్దరూ గతంలో మాదిరిగానే మళ్లీ టాలీవుడ్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్నారు. అవును. ఈ సెన్షేషనల్ కాంబోలో ఇన్నేళ్లకు మళ్లీ ఓ మూవీ తెరకెక్కబోతోంది.

నవంబర్ 20 తేదీన అన్నపూర్ణ స్టూడియోలో శివ షూటింగ్ ప్రారంభమైన చోటే.. వర్మ, నాగ్ ల చిత్రం ప్రారంభం కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పోలీస్ స్టోరీతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నాననే విషయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే నేను స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాలనుకొన్నాను. కానీ ఈ విషయంలో మీడియా నన్ను కొట్టేసింది. అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

శివ సినిమా సమయంలో అంతా షాక్ అయ్యారు. 1988లో రాంగోపాల్ వర్మ తీసే సినిమాలో నటించనున్నారనే వార్తకు... ఇందేంటీ ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అని అందరూ అనుకొన్నారు. అయితే వారందరికీ ఆర్జీవీ షాకిచ్చాడు. ఇప్పుడు 2017లో కొందరు హ్యాపీగా మరికొందరు షాక్‌లో ఉన్నారు. రాము మళ్లీ విజృంభిస్తారు. అనే ఫీలింగ్‌తో నేను ఉన్నాను అని నాగార్జున మరో ట్వీట్ చేశారు.

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఓ ప్రత్యేకత కూడా సంతరించుకొన్నది. 1988లో రాంగోపాల్ వర్మ తండ్రి ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. 2017లో వచ్చే ఈ చిత్రానికి కూడా ఈ నెల 16న ఓపెనింగ్‌ షాట్‌కు క్లాప్ కొట్టనుండటం విశేషం.

25 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా తీస్తున్నానని చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది. శివ చిత్రానికి సీక్వెల్ అని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఈ చిత్రం శివ పాత్రకుగానీ, కథకు గానీ సంబంధం లేదు అని ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశారు. నాగార్జునతో తీయబోయే సినిమా చాలా కొత్తరకమైన కథ. నాగార్జున ముందెన్నడూ నటించని పాత్ర. మీరు అలాంటి పాత్రలో నాగ్‌ను కూడా చూసి ఉండరు. నాకు శివతో దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన నాగార్జునతోపాటు శివను ఆదరించిన ప్రేక్షకుల అంచనాలకు సైతం మించి మా సినిమా ఉంటుందన్నారు వర్మ. వచ్చే ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూపై త్వరలో నిర్ణయిస్తామన్నారు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తాను అని వర్మ తెలిపారు.