Varalaxmi Sarathkumar:ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పిల్లల్ని కనాలని నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నటి లక్ష్మీ మంచు కూడా వరలక్ష్మికి సపోర్ట్ చేశారు.

చెన్నై: విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇటీవల `సరస్వతి` అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహించడంతోపాటు నిర్మించింది. ప్రధాన పాత్రలో నటించింది. కానీ సినిమా థియేటర్లలో ఆడలేదు. దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. `ఆర్థికంగా నిలదొక్కుకోకుండా పిల్లల్ని కనొద్దు` అని ఆమె తల్లిదండ్రులకు ఇచ్చిన సలహా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

ఫ్యాక్టరీలా పిల్లల్ని కనొద్దు: వరలక్ష్మి 

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి, ఇప్పటి రోజుల్లో పిల్లల పెంపకానికి డబ్బు ఎంత అవసరమో చాలా సీరియస్‌గా చెప్పారు. `మన దేశంలో `సె..` గురించి మాట్లాడటానికి సిగ్గుపడతారు, కానీ జనాభాలో మనమే నంబర్ వన్! ఇది చాలా విచిత్రంగా ఉంది. ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసినట్టు పిల్లల్ని కంటున్నారు. కన్నాక, మాకు చాలా కష్టాలున్నాయి, డబ్బుల్లేవని ఏడుస్తారు. కష్టాలుంటే పిల్లల్ని కనమని మిమ్మల్ని ఎవరడిగారు? ముందు ప్లాన్ చేసుకోండి, ఆ తర్వాతే పిల్లల్ని కనండి` అంటూ ఆమె ఘాటుగా స్పందించారు.

పిల్లల పెంపకం ఇప్పుడు చాలా ఖరీదు:

పిల్లల్ని కనడానికి తాను వ్యతిరేకిని కాదని స్పష్టం చేసిన వరలక్ష్మి, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల గురించి వివరించారు. `ఇప్పటి రోజుల్లో బతకడం చాలా ఖరీదైపోయింది. పిల్లల చదువు, ఆరోగ్యం, పెంపకానికి చాలా డబ్బు కావాలి. చాలాసార్లు నేను చూశాను, పిల్లల్ని కనేసి వాళ్ల చదువులకో, ఖర్చులకో నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతారు. వాళ్లకు నేనేమైనా జన్మనిచ్చానా? మీరు చేసిన తప్పుకు నేను ఎందుకు బాధ్యత వహించాలి? మీ పిల్లల్ని బాధ్యతగా పెంచడం మీ కర్తవ్యం` అని వరలక్ష్మి సూటిగా ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన:

ఈ ఇంటర్వ్యూలో వరలక్ష్మితో పాటు ఉన్న నటి ప్రియమణి కూడా ఆమె మాటలతో ఏకీభవించారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. `వరలక్ష్మి చెప్పింది నూటికి నూరు శాతం నిజం. బాధ్యత లేకుండా పిల్లల్ని కనడం కరెక్ట్ కాదు` అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. నటి లక్ష్మీ మంచు కూడా చప్పట్ల ఎమోజీలతో వరలక్ష్మికి సపోర్ట్ తెలిపారు.

అయితే, మరికొందరు నెటిజన్లు ఆమె మాటల్ని తప్పుబడుతున్నారు. `పిల్లల్ని కనడం అనేది వ్యక్తిగత నిర్ణయం. పేదరికంలో కూడా పిల్లలు పెరుగుతారు. ప్రతీదాన్ని డబ్బుతోనే చూడకూడదు` అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద, వరలక్ష్మి శరత్‌కుమార్ చెప్పిన ఈ 'ప్రాక్టికల్' మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో, జనాల్లో పెద్ద చర్చకే దారితీశాయనడంలో సందేహం లేదు.