Prabhas: 'ది రాజాసాబ్' ఓటీటీ రిలీజ్ కోసం జియో హాట్‌స్టార్ తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిందంటూ గతంలో ఓ ప్రచారం జరిగింది. ఇప్పుడదే ప్రభాస్ పీఆర్ టీమ్‌ను విమర్శలపాలు చేస్తోంది.
ప్రభాస్ టీమ్‌పై విమర్శలు
ఒక సినిమా హిట్టా ఫట్టా అని చెప్పడానికి ఒకప్పుడు థియేటర్లలో ఎన్ని రోజులు ఆడిందనేది లెక్క. ఆ తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయి. టీవీలో సినిమా వేసినప్పుడు వచ్చిన రేటింగ్స్‌ను కూడా అభిమానులు పెద్ద లెక్కగా చూసేవాళ్లు. ఇప్పుడు ఓటీటీ వచ్చాక, అక్కడ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనేది కూడా పాపులారిటీకి కొలమానంగా మారింది. సరిగ్గా ఇలాంటి ఓటీటీ ప్రచారం విషయంలోనే పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ టీమ్ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన 'ది రాజాసాబ్' సినిమా ఓటీటీ రిలీజ్ టైంలో జరిగిన ఓ ప్రచారమే దీనికి కారణం.
`ది రాజాసాబ్` ఓటీటీలోకి వచ్చినప్పుడు సర్వర్లు క్రాష్
జనవరి 9న థియేటర్లలో రిలీజైన `ది రాజాసాబ్` సినిమా, ఫిబ్రవరి 6న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. అయితే, ఓటీటీ రిలీజ్‌కు ముందే ఈ సినిమా కోసం హాట్‌స్టార్‌లో విపరీతమైన ట్రాఫిక్ వస్తోందని, 'రిమైండ్ మీ' బటన్ క్లిక్ చేయడానికి జనం ఎగబడుతున్నారని కొన్ని రిపోర్టులు వచ్చాయి. సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, జియో హాట్‌స్టార్ తమ సర్వర్లను అప్‌గ్రేడ్ చేసిందని కూడా ప్రచారం చేశారు. అయితే, ఇదంతా ప్రభాస్ పీఆర్ టీమ్ సృష్టించిన ప్రచారమేనని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న ఈ విషయం మళ్లీ తెరపైకి రావడానికి కారణం టీ20 వరల్డ్ కప్.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి 8.2కోట్ల వ్యూస్
ఇటీవల జరిగిన ఇండియా, న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను హాట్‌స్టార్‌లో ఏకంగా 8.2 కోట్ల మంది చూశారని ఆ ప్లాట్‌ఫామే అధికారికంగా ప్రకటించింది. ఇంతమంది ఒకేసారి చూసినా ఎలాంటి సమస్య రాని సర్వర్‌ను, ఓ సినిమా కోసం అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏముందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌కు 'సలార్' మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. `ది రాజాసాబ్` పరాజయానికి సంబంధించి దృష్టి మళ్లించడానికే ఆయన టీమ్ ఇలాంటి ప్రచారాలు చేస్తోందని ట్రోలర్స్ కామెంట్ చేస్తున్నారు.


