దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కబోతున్నట్లు ఈ మధ్య కాలంలో జోరుగా వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్, సావిత్రి లాంటి లెజెంజ్స్ జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతుండగా... ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలను బాలకృష్ణ స్వయంగా నిర్వహిస్తున్నారు.

 

తాజాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కథను సినిమాగా తీయబోతున్నారనే వార్త ఇండస్ట్రీతో పాటు రాజకీయ పార్టీల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆనందో బ్రహ్మతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు మహీ రాఘవ దీన్ని తెరకెక్కించ బోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అఫీషియల్ గా ఏలాంటి సమాచారం రాలేదు కాని స్క్రిప్ట్ దశలో వున్న ఈ మూవీపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఈ మూవీలో టైటిల్ రోల్ పోషించేందుకు అక్కినేని నాగార్జునను సంప్రదించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. దీని మీద ఇంకాస్త హైప్ ని పెంచాయి. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు అంతర్గత పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీని ఒక తాటిపైకి తీసుకొచ్చి సమర్ధవంతంగా పార్టీని అధికారంలోకి ఎలా తీసుకొచ్చారు ఎలాంటి సమస్యలు-ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే దాని మీద కథ ఉంటుందని సమాచారం.

కథ విన్న నాగ్ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసి తీసుకొస్తే అలోచించి అప్పుడు నిర్ణయం చెబుతానని అన్నట్టు టాక్. ఇదే కథను మలయాళం స్టార్ హీరో మమ్ముట్టికి గతంలోనే వినిపించారనే కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. మరి ఇద్దరికీ చెప్పారా లేక  వారిలో ఒకరు ఓకే అన్నా సెట్స్ పైకి తీసుకువెళ్తారా అనే సమీకరణాలు ప్రస్తుతానికి అంచనాల్లో మాత్రమే ఉన్నాయి. వైఎస్ ను చరిత్రలో నిలిచిపోయేలా చేసిన పాదయాత్ర ఘట్టం కూడా సినిమాలో కీలకంగా ఉంటుందట. పూర్తి సమాచారం అందాల్సివుంది.