చిత్రం: నగరం న‌టీన‌టులు: సందీప్ కిషన్, శ్రీ, రెజీనా కసాండ్రా, మధుసూదన్, చార్లే మ్యూజిక్‌: జావెద్ రియాజ్ నిర్మాత: అశ్విని కుమార్ సహదేవ్ ద‌ర్శ‌క‌త్వం: లోకేశ్ కనకరాజ్ ఏసియానెట్ రేటింగ్-3/5

కథ...

ఓ నగరంలో 48 గంటల వ్యవధిలో కొందరి జీవితాల్లో చోటుచేసుకొన్న సంఘటనలే ఈ చిత్ర కథ. రెజీనా ప్రేమ కోసం తపించే పాత్రలో సందీప్ కిషన్. ప్రేమను కాపాడుకొనేందుకు పట్టణానికి వచ్చి ఇబ్బందుల్లో పడ్డ శ్రీ. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి డ్రైవర్ అవతారం ఎత్తిన చార్లే. నగరంలో మాఫియా డాన్ మధుసూదన్ కుమారుడిని కిడ్నాప్ చేసిన ఓ ముఠా. ఓ అవినీతి పోలీస్ ఆఫీసర్. ఇలాంటి పాత్రల మధ్య జరిగిన సంఘటనలకు తెరరూపమే నగరం. చిత్ర కథ షేక్ స్పియర్ రచించిన కామెడి ఆఫ్ ఎర్రర్స్, ట్వెల్త్ నైట్ నాటకాల్లో మాదిరిగా ఉంటుంది.

ఎలా ఉందంటే...

ఎంచుకున్న క‌థ‌ని న‌డిపించ‌డానికి ద‌ర్శ‌కుడు అల్లుకొన్న సంఘ‌ట‌న‌లు, వేసుకొన్న చిక్కుముడులూ.. `న‌గ‌రం`ని ముందుండి న‌డిపిస్తాయి. రోజూ మ‌నం చూసే పాత్ర‌లు, సంఘ‌ట‌న‌లే క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌డంతో సినిమా చూస్తున్నామ‌న్న భావ‌నే రాదు. జీవితాల్ని ఓ చోట‌కు చేర్చి స్క్రీన్ ప్లే అల్ల‌డం… `వేదం` సినిమాలో చూశాం. ఇదీ అలాంటి గ‌మ్మ‌త్తైన క‌థ‌న‌మే. కాక‌పోతే ఇక్క‌డ ద‌ర్శకుడు చెప్పాల‌నుకొన్న విష‌యాలెక్కువ‌. చ‌ర్చించాల‌నుకొన్న సంగ‌తులెక్కువ‌. ఇలాంటి క‌థ చెప్పాలంటే.. చాలా నేర్పు కావాలి. ద‌ర్శ‌కుడిలో అది క‌నిపించింది. ఇంత క్లిష్ట‌మైన స‌బ్జెక్ట్‌ ని ఇంత చక్కగా చెప్పాడే అనిపిస్తుంది. ప్రేక్ష‌కుల్ని క‌న్‌ఫ్యూజ్‌లోకి నెట్ట‌కుండా అతి జాగ్ర‌త్త‌గా స్ర్కీన్ ప్లే రాసుకొన్నాడు. సంఘ‌ట‌నల్ని, పాత్ర‌ల్నీ ఒకే తాడి పైకి తీసుకురావ‌డంతోనే… ద‌ర్శ‌కుడి నేర్పు కనిపిస్తుంది. అదనపు ఆర్భాటాలేవీ లేకుండా పాత్రల ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. అనవ‌స‌ర‌మైన వినోదానికీ, పాట‌ల‌కూ ఎక్క‌డా చోటివ్వ‌లేదు ద‌ర్శ‌కుడు.

ప్ర‌ధ‌మార్థంతో పోలిస్తే ద్వితీయార్థం కాస్త నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు మ‌రీ డిటైలింగ్‌కి పోతున్నాడేమో అనే భావ‌న కూడా క‌లుగుతుంది. పాత్ర‌ల్ని మ‌రీ డీగ్లామ‌ర్‌గా చూపించ‌డం మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కూ న‌చ్చుతుందో తెలీదు. ద్విభాషా చిత్రం అని చెప్పుకొంటున్నారు గానీ… త‌మిళంలో తీసిన సినిమా ఇది. ఆ ఫ్లేవ‌ర్ అడుగడుగునా క‌నిపిస్తుంది. ప‌తాక సన్నివేశాలు బాగానే ఉన్నా.. ఈ సినిమా స్థాయిని పెంచ‌డానికి అవి స‌రిపోలేదు. నిజంగా ప్రేక్షకున్ని కదిలించే ఓ ముగింపు అందిస్తే… `న‌గ‌రం` త‌ప్పకుండా గుర్తుండిపోయే సినిమా అయ్యేది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో సొంత ఊరి గురించి చెప్పిన సంభాషణ‌లు ఆక‌ట్టుకొంటాయి. ఎవ‌రి ఊరు వాడికి గొప్ప‌.. ఊర్లో కొన్ని మైన‌న్సులు ఉండొచ్చు. కానీ పొట్ట నింపేది. మ‌న ఉనికిని చాటేది.. మ‌న ఊరేగా.

న‌టీన‌టులు...

సందీప్ కిష‌న్ న‌ట‌న మ‌రోసారి ఆక‌ట్టుకొంటుంది. హీరోయిజం చూపించాల‌ని ఎక్క‌డా ప్ర‌య‌త్నించ‌లేదు. అలాగ‌ని అదేం త‌గ్గ‌లేదు. త‌నని తాను డీ గ్లామ‌ర్‌గా చూసేందుకు ధైర్యం చేశాడు. హెయిర్ స్టైల్‌, డ్ర‌స్సింగ్ విధానం చూస్తే సందీప్ కిష‌న్ పాత్ర కోసం ఎంత త‌పించాడో అర్థం అవుతుంది. రెజీనా ప‌రిధి త‌క్కువే. కానీ తాను బాగానే చేసింది. శ్రీ న‌ట‌న బాగుంది. అయితే.. మ‌న‌కు ప‌రిచ‌యం ఉన్న న‌టుడైతే ఇంకా బాగుండేది. కిడ్నాప‌ర్ గ్యాంగ్‌లో అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి భ‌లే న‌వ్వించాడు. త‌నే కాస్త రిలీఫ్ పంచాడు. ఏ పాత్రా త‌క్కువ చేయ‌లేదు. అలాగ‌ని ఓవ‌ర్ యాక్టింగ్ కి పోలేదు. క‌థ ప్ర‌కారం న‌డిచారంతే.

సాంకేతిక నిపుణులు...

తొలిచిత్రాన్ని లోకేశ్ కనకరాజ్ అద్భుతంగా తెరకెక్కించారనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. అనేక ట్విస్టులు, సస్పెన్స్‌, హ్యూమర్, ఎమోషన్స్, థ్రిల్స్‌ను తెరకెక్కించడంలో దర్శకుడిగా లోకేశ్ నూటికి నూరు మార్కులు సంపాదించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రతికూల పరిస్థితుల్లో ఓ ప్రదేశంలో ఎదురైన సమస్యలను వ్యక్తులు ఎలా ఎదురించారనేది కథాంశం. ప్రేక్షకుడిని ఆకట్టుకొనే విధంగా కథను తెరకెక్కించుకోవడంలో సంగీత దర్శకుడు జావెద్ రియాజ్, సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్కే, ఎడిటర్ ఫిలోమిన్ అద్భుతమైన ప్రతిభను చూపించారు.

చివరగా... నగరంలో జరిగే సీన్ మా.